https://oktelugu.com/

Priyanka Gandhi Telangana: తెలంగాణలో రాహుల్ గాంధీ వల్ల కానిది ప్రియాంక గాంధీ వల్ల అవుతుందా?

కాంగ్రెస్ పార్టీ బిజెపి మాదిరే యువతను ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. జనాకర్షణ ఉన్న ప్రియాంక గాంధీతో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : May 6, 2023 9:00 am
    Follow us on

    Priyanka Gandhi Telangana: బలమైన ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఉంది. కానీ ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో లేదు. జనాలు ఓట్లు వేసి గెలిపిస్తున్నప్పటికీ అధికార పార్టీ పంచన చేరుతున్నారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ భారత రాష్ట్ర సమితికి కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతో వెళ్తుంటే ఆయన కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. ఆయన పాదయాత్ర చేస్తుంటే.. పోటీగా భట్టి విక్రమార్క లాంటివారు సీఎం రేసులో నేనున్నా అంటూ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం అధికార భారతీయ జనతా పార్టీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంటే.. ఇక్కడ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. తన స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తున్నది. ఈ పరిస్థితి మార్చాలని రాహుల్ గాంధీకి పలుమార్లు ఇక్కడ నాయకత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా వరంగల్ సభ, జోడో యాత్ర సందర్భంగా నిర్వహించిన సభల్లో సీనియర్లకు మొట్టికాయలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇక్కడ పార్టీ పరిస్థితి మార్చాలని ప్రియాంక గాంధీ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఎనిమిదవ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు.

    యువతను ఆకర్షించేందుకు

    కాంగ్రెస్ పార్టీ బిజెపి మాదిరే యువతను ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. జనాకర్షణ ఉన్న ప్రియాంక గాంధీతో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రశ్న పత్రాలు లీకేజీ వంటి అంశాల కారణంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతను తనవైపు తిట్టుకోవాలని భావిస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత గుర్తుకే ఓటు వేసేలా చూసుకునేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఎనిమిదిన నిర్వహించే నిరుద్యోగ సభలో పలు హామీలతో కూడిన ‘యూత్ డిక్లరేషన్” ను ప్రియాంక చేతుల మీదుగా విడుదల చేయాలని యోచిస్తోంది. యువశక్తి లేదా వివాహస్తం పేరుతో డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశాలు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రియాంక గాంధీ ఆవిష్కరించే డిక్లరేషన్ లో 9 అంశాలకు చోటు కల్పించినట్టు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఏటా జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలకు డిక్లరేషన్ లో చోటు కల్పించినట్టు తెలుస్తోంది.

    వరంగల్ సభ మాదిరి

    గతంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లాగానే ఈసారి కూడా యూత్ డిక్లరేషన్ తో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భారత రాష్ట్ర సమితి సర్కారు పంట రుణాలు మాఫీ చేయలేకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు వంటి వాటితో రైతులు ఆగ్రహంగా ఉన్నారని, అలాగే నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అంశాలతో యువత సీఎం కేసీఆర్ పాలన పట్ల అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా యూత్ డిక్లరేషన్ విడుదల చేస్తే ఇక్కడ యువతకు భరోసా కలుగుతుందని, అది పార్టీకి లబ్ధి చేకూర్చుతుందని భావిస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని, ఎనిమిదవ తేదీన ప్రియాంక తెలంగాణకు వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. పాదయాత్రగా సరూర్ నగర్ స్టేడియానికి వెళ్లి నిరుద్యోగ సభలో ప్రసంగిస్తారు.