RK Roja Vs Pawankalyan : ఏపీలో అధికార వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. తమ అధికారానికి ఎక్కడ గండిపడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. కుదురుగా కూర్చోనివ్వడం లేదు.. నిలకడగా నిల్చోనివ్వడం లేదన్న చందంగా వారి పరిస్థితి తయారైంది. పైకి మాత్రం వైట్ నాట్ 175 అన్న స్లోగన్. మొన్నటికి మొన్న పట్టభద్రులు కర్రకాల్చి వాత పెట్టినా వారు ఇంకా పిరికి ధైర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే వైసీపీ నేతల భయానికి పవన్ కళ్యాణే ప్రధాన కారణం. ఆయన చర్యలు మరీ దూకుడుగా ఉండడంతో వైసీపీ నేతలు తెగ భయాందోళనకు గురవుతున్నారు. అనుకున్నట్టు ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకపోతే తాము ఇంటికి వెళ్లడం ఖాయమన్న స్థిర నిశ్చయానికి వైసీపీ నేతలు వచ్చేశారు.
అవే విమర్శలు..
అయితే ఇప్పుడు ఆత్మరక్షణకో, డైవర్షన్ పోలిటిక్స్ కోసమో తెలియదు కానీ పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. జనసేనానిపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంత్రి రోజా ఒక అడుగు ముందుకేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. మరొకరి జెండా మోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారని.. పవన్ మాత్రం మరొకర్ని అధికారంలోకి తెచ్చేందుకు ఆరాటపడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పల్లకి మోసిన పవన్.. వచ్చే ఎన్నికల్లో కేఏ పాల్ పల్లకి మోయాలని సలహా ఇచ్చారు.
మెగా బ్రదర్స్ పై కామెంట్స్..
పవన్ విషయంలో ఎదురుదాడికి జగన్ ప్రధానంగా కాపు మంత్రులను వినియోగిస్తుంటారు. ఇటు సినీ రంగం నుంచి రోజా, పోసాని కృష్ణమురళిని దువ్వుతుంటారు. అందుకే నిత్యం రోజా పవన్ ను టార్గెట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ పై ఓ సారి ఓవర్ కామెంట్స్ చేశారు. ముగ్గురు సోదరులను ప్రజలు తిరస్కరించారంటూ ఎద్దేవా చేశారు. అందులో చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అదే స్థాయిలో మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను గుర్తుచేస్తూ హెచ్చరికలు పంపారు.
ఆ పల్లకి మోయాలంటూ..
అయితే ఇప్పుడు పవన్ ను మాత్రమే మరోసారి రోజా టార్గెట్ చేసుకున్నారు. కేఏ పాల్ పల్లకి మోయాలని సలహా ఇవ్వడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. పవన్ అంటే ఎందుకు అంత భయమని నిలదీస్తున్నారు. పవన్ పొత్తుల దిశగా ఆలోచన చేస్తుండడం వల్లే వైసీపీ మంత్రులు భయంతో విమర్శలకు దిగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు పవన్ పై ఇటువంటి మాటల దాడి కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.