King Charles Coronation: మరికొద్ది గంటల్లో బ్రిటన్ రాజుకు పట్టాభిషేకం.. కోహినూర్ లేకుండానే కిరీట ధారణ వెనుక అసలు కథ ఇదీ

చార్లెస్_3 పట్టాభిషేక మహోత్సవాన్ని లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబే లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి 1,020 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ భారం మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది.

Written By: Bhaskar, Updated On : May 6, 2023 8:53 am

King Charles Coronation

Follow us on

King Charles Coronation: ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న రాజ కుటుంబాల్లో బ్రిటన్ ‘రాయల్ ఫ్యామిలీకి” ఘనమైన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యమే ఇంతటి నవీనకాలంలోనూ రాచ మర్యాదలు దక్కేందుకు పడుతున్నది. అంతటి బ్రిటన్ రాజ కుటుంబాన్ని 70 సంవత్సరాలు పాటు పాలించిన రాణి ఎలిజిబెత్_2 గత ఏడాది సెప్టెంబర్లో మరణించింది. అయితే తదుపరి రాజుగా చార్లెస్_3 బాధ్యతలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం మరికొద్ది గంటల్లో చార్లెస్_3కి పట్టాభిషేకం స్వీకరించనున్నారు.

అంగరంగ వైభవంగా

చార్లెస్_3 పట్టాభిషేక మహోత్సవాన్ని లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబే లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి 1,020 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ భారం మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. తీవ్రమైన ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొంటున్న ఆదేశం ఇంత ఖర్చు పెట్టడం నిజంగా ఆశ్చర్యమే.. దీనిపై అక్కడ ఒక సెక్షన్ మండిపడుతోంది. రాజ కుటుంబానికి అంతం పలకాలని డిమాండ్ చేస్తున్నది. ఇక చార్లెస్ పట్టాభిషేకం తో పాటు క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు.

కోహినూర్ లేకుండానే

అయితే చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా రాజు కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ఈసారి వినియోగించడం లేదు. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా ఈ వజ్రం నిలిచినందున.. అది లేని కిరీటంతోనే రాజు చార్లెస్ 3, క్వీన్ కన్సార్ట్ కెమిల్లా కు కిరీట ధారణ చేయనున్నారు. ఇక పట్టాభిషేకం సందర్భంగా చార్లెస్_3 సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని ధరిస్తారు. దీనిపై 444 నవరత్నాలు, మాణిక్యాలు పొదిగించారు. దీనిని పూర్తిగా బంగారంతో తయారు చేశారు.దీని బరువు 2.23 కిలోలు. కాగా తొలిసారి 1661 లో చార్లెస్_2 ఈ కిరీటాన్ని ధరించారు. బ్రిటిష్ అధికారిక రాజకీయంగా పేరు పొందిన ఈ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్_2 తర్వాత నలుగురు మాత్రమే ధరించారు. చివరిసారిగా 1953లో ఎలిజబెత్_2 ఈ కిరీటం ధరించారు. మళ్లీ ఇప్పుడు ఆమె కుమారుడు చార్లెస్_3కి అవకాశం దక్కుతోంది. కాగా పట్టాభిషేకం నేపథ్యంలో బ్రిటన్ రాజ ప్రసాదాలను అందంగా అలంకరించారు.