YCP targets Pawan Kalyan: కొద్దిరోజులుగా రాష్ర్టంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని జనసేన పార్టీ ఆరోపణలు చేస్తోంది. దీంతో వాటిని దృశ్యరూపకంగా కూడా కళ్లకు కట్టినట్లు చూపించి ప్రజలకు చూపించింది. రహదారులు గుంతలుగా మారడంతో ప్రయాణికుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూపించారు. గతుకుల రోడ్లకు అతుకులు వేసే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న శ్రమదానం చేసి బాగు చేయాలని భావించారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రయత్నాన్ని ప్రభుత్వం అనుమతిస్తుందా లేక అడ్డుకుంటుందా అనే ఆలోచన వస్తోంది.

ఈ మధ్య ప్రతిపక్షాలను రోడ్డు మీదకు రానివ్వని వైసీపీ ప్రభుత్వం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రానిస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు వెళ్లాలని భావిస్తే ఆయనను అరెస్టు చేసి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తారా అనే సంశయాలు వస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నాలను అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు. అందుకే ఆయన రోడ్ల మీదకు రాకుండా చూసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న రాజమండ్రి, అనంతపురం జిల్లాల్లో శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో జనసేన, వైసీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. మంత్రులు జనసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు పేర్నేని నాని, బొత్స సత్యనారాయణ తదితరులు పవన్ పై ఘాటుగా స్పందించారు. విమర్శలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు జనసేన శ్రమదానం కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.