Pawan Kalyan Target: ఏపీ రాజకీయాలను షేక్ చేయడానికి రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన 9వ ఆవిర్భావ సభా వేదికపై తన భవిష్యత్తు ఏంటన్నది పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. పొత్తులపై ఆయన చేసే ప్రకటనే కీలకంగా మారింది. వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పోయేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. తనను వ్యక్తిగతంగా.. రాజకీయంగా ఇబ్బందిపెడుతున్న వైసీపీని ఓడించడానికి ఏపీ రాజకీయాల్లో కీలకమైన పొత్తులపై పవన్ ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది.
2024లో ఎలాగైనా గెలవాలని.. అధికారం పంచుకోవాలని జనసేన లక్ష్యంగా ఉంది. పవన్ పార్టీని పెట్టిన తర్వాత రెండోసారి వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. ఈసారి ఖచ్చితంగా తను గెలవడంతోపాటు జనసేనను గెలిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే బీజేపీతో బంధం తెంచుకునేందుకు.. టీడీపీతో పొత్తుకు కూడా పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సభలో పవన్ ఏం మాట్లాడుతారన్న దానిపైనే ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Radhe Shyam- Bheemla Nayak Box Office Collection: తేలిపోయిన ప్రభాస్.. నైజాం నవాబ్ పవనే
అధికార పార్టీని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా కాపు సామాజికవర్గంపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన లక్ష్యాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడంపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతారని తెలుస్తోంది.
పవన్ ఎప్పుడూ కులం కార్డు వాడలేదు. వారి ఓటు బ్యాంకుపై దృష్టి సారించలేదు. కానీ కాపులు మాత్రం పవన్ ను ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు కాపులపై కూడా పవన్ కీలక ప్రకటన చేస్తారని.. కాపునేతలందరినీ ఒక గాటిన కట్టి అధికారం దిశగా సాగబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చేరికలతో హోరెత్తిస్తున్న జనసేనకు పవన్ చేసిన ప్రకటనతో మరింత ఊపు రావడం ఖాయం అంటున్నారు. మొత్తంగా పొత్తులతోపాటు కీలక సామాజికవర్గాలను గాటిన కట్టే కొత్త వ్యూహాలతో పవన్ ప్రసంగం ఉండబోతోందని.. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.
Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలకు షాక్.. ఇక ఇప్పట్లో తేలవు… హైకోర్టులో అభ్యంతరాలు