AP Politics Year Review: మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2025 కనుమరుగు కానుంది. 2026లోకి షిఫ్ట్ అయిపోతాం కూడా. మనతో పార్టీ మన రాజకీయాలు కూడా మారిపోతాయి. అయితే గత ఏడాది కూటమి పాలన గురించి, విపక్ష పాత్ర గురించి ఒక్కసారి రివ్యూ చేసుకుంటే అనేక రకాల అంశాలు మన కళ్ళెదుట తిరుగుతాయి. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరదని భావించారు. కానీ పొత్తు కుదిరింది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగదని అంచనా వేశారు. కానీ ఎంచక్కా మూడు పార్టీలు పంచుకున్నాయి. అధికారంలోకి వచ్చాక కుదురుగా ఉండదని భావించాయి. కానీ ఏడాదిన్నర పాలన సజావుగా ముందుకు సాగిపోయింది. అయితే ఈ పరిణామాలు అన్నింటికి 2025 సజీవ సాక్షంగా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి ఈ ఏడాది ప్లస్ పాయింట్ గా నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చేదు గుళికను మిగిల్చింది.
* వైసీపీకి చేదు గుళిక
2024 లో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). కానీ కొద్ది కాలానికి ఆయన రీచార్జ్ అయ్యారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కూటమి పార్టీలపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ప్రారంభం అయిందని చెప్పుకొచ్చారు. కానీ అధికార పార్టీపై, పాలనపై సంతృప్తికి ఉప ఎన్నిక రెఫరండం. అలా వైసీపీకి కడప జిల్లాలో రెండు ఉప ఎన్నికలు కలిసి వచ్చాయి. పైగా అవి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందినవి కావడం గమనార్హం. అందులోనూ ఒకటి పులివెందుల. కానీ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్ ఫలితాలను సాధించింది. పులివెందులలో డిపాజిట్లు కూడా రాలేదు. అయితే రాజకీయంగాను కలిసి రాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై గట్టి పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఎంతో కొంత సంతృప్తి ఇచ్చింది ఈ పోరాటమే.
* అంచనాలు తారుమారు
మూడు పార్టీల మధ్య పొత్తు ఎంత కాలం ఉంటుందిలే అని తేలిగ్గా తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలో తెలియజేస్తున్నట్లు అన్నట్లు కూటమిపాలన నడిచింది. సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరస్పరం గౌరవించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోరుకున్న శాఖలు ఇవ్వడమే కాదు.. పని చేసుకునేందుకు వీలుగా స్వేచ్ఛ కూడా ఇచ్చారు. తనతోపాటు గౌరవ మర్యాదలు పవన్ కళ్యాణ్ కు అందిస్తూ వచ్చారు చంద్రబాబు. పేరుకే సంకీర్ణ కూటమి కానీ.. ఒకే పార్టీ పాలన సాగిస్తున్నట్టుగా ఉంది. గత 18 నెలల కాలంలో మూడు పార్టీల మధ్య విభేదాలు ఎప్పుడు వస్తాయా? చొచ్చుకు పోదామా? అన్నట్టు వేచి చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ వారి పాచిక పారలేదు.
* ఇద్దరి మధ్య ఆరోగ్యకర పోటీ..
లోకేష్( Nara Lokesh) విషయంలో పవన్ లో అభద్రతాభావం రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించకుండా.. ముందుగా సమర్ధులైన మంత్రులుగా నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కృషి చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఇద్దరూ కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే స్వభావంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే వారిద్దరి మధ్య సహృద్భావ వాతావరణం, ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది.
* ఎవరి పాత్రలో వారు..
సీఎం చంద్రబాబు( CM Chandrababu) తనకు వచ్చిన అవకాశాన్ని తన విషయాల దృక్పథం, దూర దృష్టితో రాష్ట్ర అభివృద్ధికి గట్టిగానే కృషి చేస్తున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో అడుగులు వేస్తున్నారు. క్షణం తీరికలేని బిజీగా ఉన్న సమయంలో.. ప్రతి నెలలో ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు బలపరుచుకుంటున్నారు. ఇంత కలిసికట్టుగా పనిచేస్తూనే ముగ్గురు తమ తమ పార్టీలను బలోపేతం చేసుకుంటున్నారు. బిజెపికి పెద్దన్న పాత్ర ఇస్తూ కూటమి ముందుకు సాగుతున్న తీరు మాత్రం అభినందనలు అందుకుంటుంది. అందుకే 2025 అధికార కూటమికి తిరుగులేని ఏడాదిగా నిలవగా.. వైసీపీకి మిశ్రమ లబ్ధి ఇచ్చింది.