Munugode By Election 2022: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఉదయం మొదలైన పోలింగ్ ఇప్పటివరకు 25 శాతానికి చేరుకుంది. చండూరు, నారాయణపురం మండలాల పరిధిలోని గ్రామాల్లో కొన్నిచోట్ల ఎన్నికల అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుగోడు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నదని ఎన్నికల అధికారి వికాస్ రాజు వెల్లడించారు. నల్లగొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఓటర్ మదిలో ఏముందంటే
పోలింగ్ ఇప్పటివరకు 25 శాతానికి చేరుకున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దాదాపు 15 రోజులుగా రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించకుండా గుంభనంగా వ్యవహరించారు. వాస్తవానికి ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల నేతలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లారు. తి ఓటర్ ని ఒకటికి నాలుగు సార్లు కలిశారు.. ఎన్ని సమీకరణాల రూపంలో ఓటు అభ్యర్థించాలో అన్ని ప్రయోగించారు..
అభివృద్ధిని కోరుకుంటే
మీ ప్రాంతం ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గం ఇతర ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఈ విషయాన్ని స్థానిక ఓట్లతో పాటు రాజకీయ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ కూడా మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాదిలోనే జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓటర్లు ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇన్నాళ్లు పెండింగ్లో ఉంచిన నిధులను మొత్తం విడుదల చేసింది. మరో ఏడాది పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం ఓటర్లలో కలిగిందని టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని, రాజీనామా చేసి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లినందున ఇప్పుడు మళ్లీ గెలిచిన అదే పరిస్థితి ఉంటుందేమోనన్న సందేహాలు కూడా ఓటర్లు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల వైఖరి మార్చుకుంటుందని ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసే అవకాశం మునుగోడు ప్రజలకు దక్కుతుందని బిజెపి నేతలు చెబుతున్నారు.
స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం
మునుగోడు ఉప ఎన్నికలను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓటర్ల మనోగతం ఎంతకి అర్థం కాకపోవడంపై అధికార టీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీటీసీ స్థాయికి దిగిపోయి పనిచేశారు. పోలింగ్ ముందు రోజు 90 శాతం మంది ఓటర్లకు ₹3000 చొప్పున పంపిణీ చేశారని అంటున్నారు. ఓవైపు వామపక్షాల మద్దతు, మరోవైపు కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు ను కాపాడుకుంటుందనే నమ్మకం వంటి అంశాలు తమ విజయానికి పునాదులుగా టిఆర్ఎస్ నేతలు అంచనా వేశారు. తొలత 30 వేల మెజార్టీ కాయమని కానీ పోలింగ్ కు ముందు రోజు గులాబీ శిబిరంలో అనూహ్యంగా ఒత్తిడి మొదలైంది. ఎంతో కొంత మెజారిటీతో బయటపడితే చాలు ఊపిరి పీల్చుకోవచ్చనే మాటలు ఆ పార్టీలో మొదలయ్యాయి.

అవకాశం కోసం బిజెపి నాయకుల పట్టు
ఏమాత్రం పట్టు లేని గ్రామీణ నియోజకవర్గం మునుగోడును ఢిల్లీ పెద్దలు టార్గెట్ చేశారు. వారి అంచనాలకు తగ్గట్టే బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్న అభ్యర్థి దొరికాడు. ఆయనకు నియోజవర్గంలో ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తారని పేరు ఉంది.. ప్రచారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానికంగా మకాం వెయ్యడం, ఈటల రాజేందర్, రఘు నందన్ రావు వంటి ఉద్దండుల ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు ఎన్నికల మంత్రాంగాల్లో ఉద్దండులైన సునీల్ బన్సల్ పర్యవేక్షణ, ఆర్ఎస్ఎస్ నుంచి 1000 మంది ప్రచారం, సినీ నటుల ప్రచారం బిజెపికి అదనపు హంగులను తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం చండూరు, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, మర్రిగూడ మండలాలపై బిజెపి పూర్తి శాతం నమ్మకంతో ఉంది. అయితే పోలింగ్ ఇప్పటివరకు 25% నమోదు కావడంతో ఎటువైపు మళ్ళుతున్నారనేది స్పష్టంగా తెలియక పోయినప్పటికీ.. బిజెపి నాయకులు ఒకింత ఉత్సాహంతో.. టిఆర్ఎస్ నాయకులు కొంత ఒత్తిడితో ఉన్నారు. అయితే పోలింగ్ శాతం బట్టే ఒక అంచనాలకు రాగలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.