https://oktelugu.com/

Jagan: జగన్ పై ఎన్టీఆర్ అస్త్రం పనిచేస్తుందా?

తన రాజకీయం కోసం మమ్మల్ని బలి పశువులుగా మార్చారని జగన్ పై ఎమ్మెల్యేలకు కోపం ఉంది. దేవుళ్లకు కోళ్లు, జంతువులను బలి ఇచ్చే సందర్భంలో నోట్లో నీళ్లు పోస్తారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 8, 2024 / 11:43 AM IST
    Follow us on

    Jagan: రాజకీయాల్లో మొండితనం ఫ్యాషన్ గా పనిచేస్తుంది. అయితే అది కొద్ది రోజులు మాత్రమే. ఎన్టీఆర్ విషయంలో ఆయన మొండితనం పార్టీ పెట్టిన తొలినాళ్లలో పనిచేసింది. కానీ అదే మొండితనం పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేసింది. తిరుగుబాటుకు కారణమైంది.ఇప్పుడు జగన్ విషయంలో అదే వైఖరి కనిపిస్తోంది. మొండితనంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి వైసీపీని ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి గెలిచేందుకు మొండితనం ప్రదర్శిస్తున్నారు. మీరు అవసరం లేదన్నట్టు ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్నారు. ఇది తప్పకుండా చేటు తెచ్చి పెడుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

    తన రాజకీయం కోసం మమ్మల్ని బలి పశువులుగా మార్చారని జగన్ పై ఎమ్మెల్యేలకు కోపం ఉంది. దేవుళ్లకు కోళ్లు, జంతువులను బలి ఇచ్చే సందర్భంలో నోట్లో నీళ్లు పోస్తారు. కానీజగన్ మాత్రం బలిపెట్టే కోళ్లు, జంతువులకు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వడం లేదని టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదో అవమానంగా భావించి వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. పక్క పార్టీల్లోకి వెళుతున్నారు. ఇదో నిరంతర ప్రక్రియ గా మారింది. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం నెలకొంది.

    ఎన్టీఆర్ విషయంలో కూడా ఇటువంటిదే చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం అధికమైంది. అటు ఇద్దరు అల్లుళ్ళు అధికార కేంద్రాలుగా మారిపోయారు. అప్పటివరకు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన ఈనాడులో కూడా ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటికే పార్టీపై చంద్రబాబు పూర్తి పట్టు సాధించారు. అదును కోసం వేచి చూస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటి కారణాలతో చంద్రబాబు స్ట్రాంగ్ అయ్యారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా.. అదే కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు పార్టీని సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది వెన్నుపోటు అన్నారు. ఎన్టీఆర్ ది స్వయంకృతాపమన్నారు. ఎవరికి తోచింది వారు విశ్లేషించుకుంటున్నారు.

    ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. టిక్కెట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జగన్ ఇష్టం. కానీ చేజేతులా రాజకీయంగా నష్టం చేసుకునే పని ఎందుకు పాల్పడుతున్నారనేది ప్రశ్న. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేసుకుంటున్నారు. మరోవైపు కుటుంబాన్ని సైతం వదులుకున్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దానిని అధిగమించే ప్రయత్నం చేయడం లేదు. కానీ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై ఎగదోయడం మాత్రం స్వయంకృతాపమే. కేవలం అభ్యర్థులను మార్చినంత మాత్రాన.. గెలుపు మరోసారి దక్కుతుందని జగన్ అంచనా వేయడం అత్యాశే అవుతుంది. చెత్తను పొరుగు ఇంట్లో వేస్తే బంగారంగా మారుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చేజేతులా విపక్షాలతో పాటు ఎల్లో మీడియాకు జగన్ అస్త్రాలు ఇస్తున్నారు అన్న విమర్శ వ్యక్తం అవుతోంది. కచ్చితంగా ఇది చేటు తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.