Homeజాతీయ వార్తలుBRS: లోక్‌సభ బరిలో కేసీఆర్, కేటీఆర్, కవిత.. అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?

BRS: లోక్‌సభ బరిలో కేసీఆర్, కేటీఆర్, కవిత.. అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?

BRS: బీఆర్‌ఎస్‌.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచి.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని కలలు కన్న పార్టీ. ఇందుకోసం పార్టీ పేరునే మర్చుకుంది. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉంది. కుటుంబ పాలన, అహంకార పూరిత ధోరణితో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించారు. పదేళ్లు ఓటమంటూ ఎరగని పార్టీకి.. తాజా ఓటమి మింగుడు పడడం లేదు. ప్రధానంగా పార్టీ పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. విశ్లేషకులు ముందుగా అంచనా వేసినట్లే అంతా జరుగుతోంది. జాతీయ రాజకీయాలు ఏంటోగానీ, తెలంగాణలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ టెన్షనే గులాబీ బాస్‌ కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం లేకుండా..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. మరో 40 రోజుల్లో నోటిషికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గులాబీ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును.. లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పడకుండా ఉండేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిరాశలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను, చేసిన పొరపాట్లను ఒప్పుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేస్తున్నారు.

కేసీఆర్‌ ఇంట్లో ఎన్నికల చిచ్చు..
ఒక్క ఓటమి బీఆర్‌ఎస్‌కు అనేక సమస్యలు సృష్టించడంతోపాటు కేసీఆర్‌ కుటుంబంలోనే చిచ్చురేపాయని గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావు రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో కీలక ప్రకటన చేశారు. కేసీఆర్‌ వేగంగా కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్‌కు వస్తారని తెలిపారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారని వెల్లడించారు. జిల్లాల పర్యటన కూడా చేస్తారని తెలిపారు. అంటే కేటీఆర్‌ను ఇక పక్కకు పెడతారా అన్న చర్చ జరుగుతోంది.

పార్టీని పట్టించుకోని గులాబీ బాస్‌..
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ పార్టీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మొత్తం కేటీఆర్‌కే అప్పగించారు. ఈ క్రమంలో హరీశ్‌రావు కేసీఆరే పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని ప్రకటన చేయడం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఇప్పటికే కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్‌ కూడా లోక్‌సభ బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈమేరకు సంకేతాలు ఇస్తున్నారు. ఇక కవిత ఎలాగూ పోటీకి సిద్ధమవుతోంది. దీంతో కుటుంబంలో ముగ్గురికి ముగ్గురూ లోక్‌సభపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది.

ఎందుకీ లేక్‌లు..
వాస్తవానికి ముగ్గురూ రాష్ట్ర రాజకీయాలను విడిచే అవకాశం ఉండదు. కానీ, కేటీఆర్‌ ఎందుకు లీక్‌ ఇచ్చారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటి వరకు కేటీఆర్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటున్నారు. కవిత జాతీయ రాజకీయాలపై ఫోక్‌ చేస్తున్నారు. కానీ, ఇప్పుడు కేటీఆర్‌ అనూహ్యంగా లోక్‌సభ బరిలో ఉంటానని లీక్‌ ఇవ్వడం, ఇదే సమయంలో కేసీఆర్‌ పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు వస్తారని హరీశ్‌రావు ప్రకటించడం బీఆర్‌ఎస్‌ భవన్‌లో చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ కుటుంబంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై గొడవ జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version