Telangana BJP: మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం మేమేనని గట్టిగా చెప్పిన భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా చప్పబడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. కానీ ఒక్కసారిగా బిజెపి పరిస్థితి రాష్ట్రంలో పడిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ పలు సంచలన ప్రకటన చేశారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. మరోవైపు అనుకోని వరంలా తగిలిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు బిజెపి విపరీతమైన హైప్ ఇచ్చింది. తర్వాత దానిని చల్లార్చింది. ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పై ప్రత్యక్షంగా పడింది.
మొన్నటి నుంచి ఢిల్లీలో మకాం వేసిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు. మొన్న అమిత్ షా తో జరిగిన భేటీ లోనూ ఇదే విషయాన్ని చర్చించారు. తెలంగాణలో బిజెపి భారత రాష్ట్ర సమితిని నిలువరించాలంటే కవితను అరెస్టు చేయాలని, భారత రాష్ట్ర సమితి ప్రత్యక్ష పోరాటం కొనసాగించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో మా దారి మేము చూసుకుంటామని అమిత్ షా ముఖం మీద చెప్పేశారు. భారత రాష్ట్ర సమితి అవినీతి లెక్కలు తెలిసినప్పటికీ కావాలనే భారతీయ జనతా పార్టీ దాగుడుమూతలు ఆడుతోందని, జనాలు అనుకుంటున్నారని అమిత్ షా దృష్టికి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోవాలంటే భారత రాష్ట్ర సమితి పై చేస్తున్న పోరాటంలో సీరియస్ నెస్ చూపించాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ఉదాహరణలు చాలు తెలంగాణ బిజెపి ఎదుగుదల కవిత అరెస్టు మీద ఎలా ఆధారపడిందో చెప్పేందుకు.
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయమని ఒక రెండు సంవత్సరాల పాటు హడావిడి చేసింది. దీనికి కొన్ని కొన్ని సంఘటనలు కూడా ఆ పార్టీకి అదనపు బలంగా మారాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్, టెన్త్ హిందీ పేపర్ లీకేజీ, దుబ్బాక, హుజరాబాద్ ఎన్నికల ఎపిసోడ్లతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల నోళ్లల్లో ప్రముఖంగా నానింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి వారు పలమార్లు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. దీంతో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. ఆయాచిత వరం లాగా లభించిన లిక్కర్ స్కామ్ కేసులోనూ విచారణకు సంబంధించి బిజెపి కేంద్ర పెద్దలు మొదట్లో చూపించిన దూకుడు ఇప్పుడు ప్రదర్శించకపోవడంతో స్థానిక నాయకత్వంలో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది. ఇక దీనికి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి కూడా తోడు కావడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలం పెంచుకుంది. భారత రాష్ట్ర సమితిలోని అసంతృప్త నాయకులకు గాలం వేస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇక ఇలాంటి పరిణామాలను చూస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అధిష్టానం మీద గరంగా ఉన్నారు. కవితను అరెస్టు చేస్తేనే పార్టీ పునర్ వైభవం పొందుతుందని అంటున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.