
Jagan- Investments: మాట తప్పం.. మడమ తిప్పం. ఇది ఎన్నికల ముందు నినాదం. ఊరికో మాట.. పూటకో పాట. ఇది ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వ విధానం. ఏపీ ప్రభుత్వ తీరు నరంలేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది అన్నట్టుంది. ఏపీ ప్రభుత్వ వ్యవహారం రోజుకో మాటతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ సాగిపోతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. ఏపీ రాజధాని ఏంటో ప్రపంచ పెట్టుబడిదారులకు చెప్పేసింది. కానీ ఇంకా ఏపీ ప్రజలకు మాత్రం తెలియదు. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతుందో చూద్దాం.
ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదంగా ఉందని చెప్పవచ్చు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపారు. కానీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల రాగం అందుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అన్న సంగతి కూడా మర్చిపోయి దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతున్నారు. మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన్ ? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. ఇంతటి స్పష్టత లేని ప్రభుత్వాన్ని ఎక్కడ చూసి ఉండరనేది మాత్రం సుస్పష్టం. ఎందుకంటే ఓ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఆ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తే.. ఆ ప్రభుత్వాన్ని ఏమనాలో తెలియదు.
మూడు రాజధానులంటూ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు పూనుకున్నారు. ఆ తర్వాత వారే.. అబ్బే అలాంటిదేమీ లేదంటూ సుప్రీం కోర్టులో తేల్చి చెప్పారు. కానీ అంతక మునుపే కర్నులులో గర్జన పేరుతో ర్యాలీ తీశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. అధికారంలో లేని చంద్రబాబును తిట్టారు. వెంటనే సుప్రీంకోర్టులో నాలుక మడతెట్టేశారు. ఇప్పుడు రాయలసీమ ప్రజలు ఎవర్ని తిట్టాలి ? 49 సీట్లు వచ్చిన వైసీపీనా ? మూడు సీట్లు వచ్చిన టీడీపీనా ? . ఇప్పుడు విశాఖే రాజధాని అంటున్నారు. మూడు రాజధానులు మిస్ కమ్యూనికేషన్ అంటున్నారు. పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటున్నారు. మూడున్నరేళ్ల నుంచి మిస్ కమ్యూనికేషన్ చేస్తున్న వైసీపీని నమ్మి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడతారా ? అన్న విషయం వైసీపీ నేతలు ఆలోచించాలి. పెట్టుబడులు పెట్టాలంటే ప్రశాంతమైన, నమ్మకమైన, స్థిరమైన వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణం ఏపీలో ఉందా ? అన్న విషయం వైసీపీ గుర్తుచేసుకోవాలి.

వైసీపీ పిలవగానే పొలోమని ఇన్వెస్టర్లు వచ్చి పెట్టుబడులు పెడతారా ? అన్న విషయం ఆలోచించుకోవాలి. ఇప్పటికే అమరావతిలో భూసమీకరణ జరిగింది. అక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. ఆ సమస్య తీరిన తర్వాతే విశాఖలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టులో మూడు రాజధానుల అంశం విచారణ జరుగుతోంది. తీర్పు ఇంకా రాలేదు. అప్పుడే విశాఖ రాజధాని అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితులు పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తాయా ? అన్న విషయం వైసీపీ నేతలు ఆలోచించాలి. ఒకరికి అన్యాయం చేసిన చోట మరొకరికి అన్యాయం జరగదన్న భరోసా ఉంటుందా ? అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. వైసీపీ చెప్పినట్టు పెట్టుబడులు రావాలంటే అలాంటి వాతావరణం రాష్ట్రంలో కల్పించాలి. అంతే కానీ పూటకో మాటతో ప్రజలన్ని మభ్యపెట్టగలరు కానీ పెట్టుబడిదారుల్ని కాదు.