
Kondagattu Temple- KCR: కొండగట్టు.. అత్యంత మహిమాన్విత క్షేత్రం. పాపాల ప్రక్షాళన, గ్రహదోషాలు పోగొట్టే దేవుడిగా అంజన్నను భక్తులు కొలుస్తారు. కొండగట్టుకు వెళ్తే ఎలాంటి దోషమైనా పోతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఇదే నమ్మకంతో దన జాతకంలో దోషాలను, ఆరేల్ల క్రితం కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించకపోవడంతో చుట్టుకున్న పాపాన్ని పోగొట్టుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అంజన్న దర్శనానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పాప ప్రక్షాళనలో భాగంగా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్న సీఎం కేసీఆర్‌కు ఆరేళ్ల తర్వాత కూడా బస్సు ప్రమాద బాధితులు గుర్తుకురాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాడు ఆపద్ధర్మ సీఎంగా..
2018 సెప్టెంబర్ 11న జగిత్యాల జిల్లా కొండగట్ట వద్ద బస్సు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందకు వస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 64 మంది దుర్మరణం చెందారు. దేశంలోనే అతి పెద్ద బస్సు ప్రమాదం ఇది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొండగట్టు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగినా ఆయన బాధిత కుటుంబాల పరామర్శకు రాలేదు. కానీ, అదే సమయంలో 160 కిలోమీటర్ల మెరుపు వేగంతో ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం.. ఫలితంగా సినీ నటుడు, కరుడుగట్టిన సమైక్యవాది, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాత్ర కేసీఆర్ వెళ్లారు. హరికృష్ణ మరణవార్త విన్న కేసీఆర్ తల్లడిల్లిపోయారు. వెనువెంటనే హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులు ఎక్కడ కోరితే అక్కడ అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అంతేకాదు హరికృష్ణ ఇంటికి పోయి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఎంతైనా తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన వ్యక్తి ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఆమాత్రం చేసి ఉండొచ్చని అంటున్నారు. కానీ, కొండగట్టు బస్సుప్రమాదంలో మరణించినవారు కేసీఆర్‌కు గుర్తుకు రాకపోవడమే నాడు పెద్ద చర్చకు దారితీసింది.
ట్యాంకు కూలి 20 మంది చనిపోతే పరామర్శించిన వైఎస్సార్..
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో 2004లో వాటర్ టాంక్ కూలి 20 మంది చనిపోయారు. నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి హుటాహుటిన కొండగట్టుకు వచ్చారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. రామడుగు మండలంలోని వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైన పిల్లలు చనిపోయిన సంఘటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చారు. 64 మంది బస్సు ప్రమాదంలో చనిపోయినా కేసీఆర్ మాత్రం రాలేదు.
బస్సు ప్రమాద బాధితులకు న్యాయమేదీ..?
సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో.. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు నిరసనకు దిగారు. బస్సు ప్రమాద బాధితుల్పి ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగిన కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు.. కేసీఆర్ కొడిమ్యాలకు వచ్చి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం జరిగి నాలుగేళ్లు పూర్తయినా బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా పర్యటనలో కేసీఆర్ బస్సు ప్రమాద స్థలాన్ని చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్ కలిసే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.