రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన గడువును ప్రకటించింది. ప్రభుత్వ పథకాలకు అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే బియ్యం కార్డు, పింఛన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇకపై సంక్షేమ పథకానికి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా అందజేయకుంటే సంబంధింత అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తే ఏడాది తరువాత ఇచ్చే వారని, అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలో 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. పెన్షన్ లు 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని, అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. పథకాల అమలు విషయంలో కలెక్టర్లు, అధికారులదే బాధ్యత వహించాలన్నారు.