Galla Jayadev: తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని దూరం కానున్నారు. త్వరలో పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. చివరకు లోకేష్ పాదయాత్రలో సైతం పెద్దగా కనిపించలేదు. దీంతో ఆయన ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఆయన స్పందించిన దాఖలాలు కూడా లేవు.
గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ముగ్గురు టిడిపి ఎంపీ అభ్యర్థులు నిలబడ్డారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గెలుపొందారు. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఒక్కరే యాక్టివ్ గా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కేశినేని నాని త్వరలో పార్టీని వీడుతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు అందరి చూపు గల్లా జయదేవ్ పైనే ఉంది. ఆయన పార్టీలో ఉంటారా? బయటకు వెళ్తారా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆయన తల్లి గల్లా అరుణ్ కుమారి టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తుండడం విశేషం. జయదేవ్ మాత్రం ఎక్కడా బయట కనిపించడం లేదు.
కొంతకాలంగా రాజకీయాల పట్ల జయదేవ్ అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని జయదేవ్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని విడిచిపెడతారని.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఆయన వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని.. కొనసాగితే టిడిపిలో.. లేకుంటే మాత్రం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని అనుచరులు చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా జయదేవ్ సైలెంట్ కావడం వెనుక మాత్రం ఏదో కారణం ఉంది. వైసీపీ ప్రభుత్వం వ్యాపార పరంగా గల్లా కుటుంబానికి ఇబ్బంది పెట్టిందని బయట ప్రచారం ఉంది. అందులో భాగంగానే జయదేవ్ సైలెంట్ అయ్యారా? అన్నది కూడా ఒక అనుమానమే.
వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయడం అనుమానంగా తేలుతోంది. టిడిపికి ఇది బలమైన నియోజకవర్గం. పైగా కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. అందుకే జయదేవ్ గత రెండుసార్లు విజయం అందుకున్నారు. ఈసారి మాత్రం ఆయన తప్పుకుంటే కమ్మ సామాజిక వర్గం నాయకుడిని బరిలో దించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారని తెలుస్తోంది. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఏదో ఒక ఆలోచన చేయకపోతే జయదేవ్ ఇన్ని రోజులు గుంటూరుకు దూరంగా ఉండరని.. ఆయన తప్పకుండా చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి జయదేవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.