
KCR Gajwel: గజ్వేల్… సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధి కోసం గడా అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిన ప్రాంతం. అలాంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు కెసిఆర్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తోంది. అది కూడా ఆయన సొంత పార్టీ నుంచే.. ఇక్కడి గజ్వేల్ మున్సిపాలిటీలో అధికార భారత రాష్ట్ర సమితి పాలకవర్గం గా గెలిచింది. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా రాజమౌళి గుప్తాను కేసీఆర్ నియమించారు. అయితే ఈ నియామకంపై ఇప్పుడు అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. కెసిఆర్ ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చారు. ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారం కింద అవిశ్వాస నోటీస్ ను కలెక్టర్ కు అందజేసిన 14 మంది కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లిపోయారు. చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నందున తాము అవిశ్వాసాన్ని ప్రకటించామని, అందుకే నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని కౌన్సిలర్లు ఒక వీడియో విడుదల చేశారు. వీడియో తో పాటు దీనికి సంబంధించిన పాలు మెసేజ్ లు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొడుతున్నాయి.
” గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగలేదని అంటున్నారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా కనీసం మనస్సాక్షికైనా భయపడండి. మీ అవినీతికి సంబంధించిన ఆధారాలు మొత్తం మేము తయారు చేశాం. ఇప్పటికే మీరు చేసిన పనుల వల్ల పార్టీ పరువు పోయింది. కేసీఆర్ రేపు ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలవలేని పరిస్థితి ఏర్పడింది. మీరు చేసిన అవినీతిని ప్రజల్లో పెట్టి మరింత బజారుపాలు చేసేందుకు మేము సిద్ధంగా లేము. పార్టీకి మేము పూర్తి విధేయులుగా ఉన్నాం. అధిష్టానం వద్ద మాత్రమే మా గోడును వినిపించుకుంటాం. గజ్వేల్ లో పార్టీని కాపాడుకునేందుకు అన్ని విధాల మేము సంసిద్ధులమై ఉన్నాం. మునిసిపల్ పాలనా వ్యవహారాల్లో మీ కుమారుడు జోక్యం ఎందుకు చేసుకుంటున్నాడు? మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు మాత్రమే ఉండే మున్సిపల్ అఫీషియల్ గ్రూపులో మీ కొడుకు నెంబర్ ఎందుకు ఉంది? మన పాలనా వ్యవహారాలు ఆఫీస్ వ్యక్తిగత విషయాలు అతడికి తెలియాల్సిన అవసరం ఏముంది” అంటూ కౌన్సిలర్లు చేస్తున్న వాట్సాప్ మెసేజ్ లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

” గతంలో గవర్నమెంట్ హాస్పిటల్, మణికొండ భూపతిరావు సత్రం కబ్జా విషయంలో మీ కుమారుడి ప్రమేయం ఉన్నది అనే విషయం వాస్తవం కాదా? మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనులను యూజీడి కాంట్రాక్టర్ తో చేయించి డబ్బులు డ్రా చేసుకున్న విషయం నిజం కాదా? మధు శ్రీ ఇన్ఫ్రా, సిద్దిపేట కాంట్రాక్టర్ సుగుణాకర్ తో కలిసి కాంట్రాక్టులు చేసింది ఎవరో తెలియదా? మట్రాజ్ పల్లి గ్రామ ప్రజలు భూముల విషయంలో మీ కుమారుడు ఇబ్బంది పెడుతున్నారని వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ లు పెట్టిన విషయం వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ పరువు తీసే ఎన్నో పనులు చేసినవు. అన్నీ అధిష్ఠానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం” అంటూ కౌన్సిలర్లు చేస్తున్న వాట్సాప్ మెసేజ్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో అవిశ్వాస నోటీసు రాజకీయంగా మారుతున్నాడంతో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి దిద్దుబాటు చీరలకు దిగినట్టు తెలుస్తోంది. ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు క్యాంపులో ఉన్న కొందరు కౌన్సిలర్లతో యాదవ రెడ్డి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అవిశ్వాస రాజకీయాల వల్ల పార్టీ పరువు బజారున పడుతుందని,ఏవైనా ఉంటే మాట్లాడుకోవాలనే దిశగా ఎమ్మెల్సీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు.