
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. నువ్వా నేనా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కానీ స్వయంకృతాపరాధం కాంగ్రెస్‌ను దెబ్బతీస్తోంది. మరోవైపు బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ దూసుకుపోతుంది.
కమలానికి ఆయుధమిచ్చన కాంగ్రెస్..
ప్రత్యామ్నాయ రేసులో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో బీజేపీ కాస్త ముందుంది. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్‌లు కూడా కోల్పోయిన పరిస్థితి అందుకు కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు ఆ పార్టీని నాశనం చేస్తుంటే బీజేపీ పక్కా ప్లాన్‌తో దూసుకుపోతుంది. ఇక ఇదే సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి మరో ఆయుధం ఇచ్చారు. అది ఇప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేయడానికి మరో అవకాశం ఇచ్చింది. ఒకపక్క బీఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే మరోపక్క తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్‌కు కోమటిరెడ్డి వ్యాఖ్యలు బూస్ట్‌గా మారాయి.

ఎన్నికల తర్వాత హంగ్ తప్పదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పడేశాయి. బీజేపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. మీరిలా మాట్లాడితే మాకే కదా లాభం అన్నట్టు బీజేపీలో ఉత్సాహం కనిపిస్తుంది. ఇక బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన ఆయుధాన్ని వాడటంలో తమ టాలెంట్ చూపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎన్నికల వరకు తన్నుకొని చివర్లో మాత్రం కలిసి పోటీ చేస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు తన సారథ్యంలో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేస్తున్న బండి సంజయ్‌కు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి వెతుక్కునే పని లేకుండా, వారే కావాల్సిన ఆయుధాలను అందిస్తున్నారు.