Telangana Elections: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తాపత్రయపడుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అదేం లేదని కొట్టిపారేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోమారు ముందస్తు ఎన్నికలపై జోస్యం చెబుతున్నారు. సీఎం వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళతారని మరోమారు జోస్యం చెప్పడం గమనార్హం.
ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం ముందస్తు ఆలోచన లేదని కుండబద్దలు కొట్టినా ప్రతిపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తుకు వెళతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం మూడో కూటమి ప్రయత్నాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఇంకా కొందరు నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు.
మరోవైపు బీజేపీని నిలువరించాలని టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ తో సమావేశమై రాజకీయ విషయాల మీద చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన సూచించిన వ్యూహంలో భాగంగానే బీజేపీ నేతలపై కేసుల వరకు వెళ్లడం తెలిసిందే. కానీ ఇక్కడ పరువు పోగొట్టుకున్నది మాత్రం టీఆర్ఎస్ నేతలే. అనవసరంగా వారిపై అభాండాలు మోపి ఏదో జరుగుతోందనే భ్రమలు కల్పించడం వారి తెలివితక్కువ తనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఏదైనా చేయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా అడ్డదారిలో కాదనే విషయం తెలిసినా అధికార పార్టీ నేతలు అప్రదిష్టను మూటగట్టుకుంటున్నారు. ఇక కేసీఆర్ మాత్రం తాను జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతాననే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అది అంత సులభం కాదనే విషయం బోధపడక మూడో కూటమి ప్రయత్నాల్లో ముమ్మరంగా మునిగిపోయారు.
Also Read: KCR National Politics: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం
తానేదో చేస్తానని దేశాన్ని మారుస్తానని చెబుతూ ఉపన్యాసాలు ఇస్తున్నా అది నమ్మే స్థితిలో ప్రజలు లేరనే సంగతి అర్థం కావడం లేదేమో. ఏదిఏమైనా భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.
అయితే గతంలో ముందస్తుకు వెళితేనే లాభం ఉందనుకుని నిర్ణయించుకున్నాక వెళ్లారు. ఈసారి ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ముందస్తుకు వెళితే పరాజయం పాలై నష్టపోయే కంటే అయిదేళ్ల కాలం పూర్తయ్యాక వెళితే ఇంకా ఏదైనా అనుకూలంగా మారొచ్చనే ఉద్దేశం అధికార పార్టీలో వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ సారి ముందస్తుకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదని సమాచారం. ప్రతిపక్షాలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళతారనే అభిప్రాయం వారి వ్యక్తిగతంగానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Kcr- Prakash Raj: కీలక స్థానం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ.. కేసీఆర్ అంత పెద్ద త్యాగం చేస్తున్నారేంటి..?