Narayanaswamy: వచ్చే ఎన్నికలను వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకెళ్తున్న తరుణంలో.. ప్రతి నియోజకవర్గాన్ని గెలుపొందాలని భావిస్తోంది. అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యింది. గెలుపు గుర్రాలనే పోటీలో దించాలని చూస్తోంది. సర్వేల్లో వెనుకబడిన వారిని పక్కకు తప్పించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది. ఇందులో ఎంతటి పెద్ద నేతలు ఉన్నా.. ఎటువంటి భేష జాలాలకు పోకుండా పక్కకు తప్పించే పనిలో ఉంది. అయితే ఈ జాబితాలో డిప్యూటీ సీఎం ఉండడం విశేషం.
ఆ మధ్యన వైసిపి సర్కార్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వేలో వెనుకబడిన వారిని పక్కకు తప్పిస్తామని కూడా జగన్ తేల్చి చెప్పారు. కొందరి పేర్లను బాహటంగానే ప్రకటించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. అయితే చాలామంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న చాలామందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ అన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఈసారి టిక్కెట్ లేదని తేలుతోంది. వైసిపి చేయించుకున్న ప్రతి సర్వేలో నారాయణస్వామి వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నారాయణస్వామికి మంత్రివర్గ విస్తరణలో జగన్ ఛాన్స్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం గా కూడా అవకాశం కల్పించారు. కానీ ఆయన నోటి దురుసుతో వ్యవహరిస్తారు అన్న అపవాదులు మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికం. దాదాపు 60 వేల పైచిలుకు ఓట్లు ఉంటాయి. వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసిన గెలుపు సునాయాసమే. అయితే తన వ్యవహార శైలితో అన్ని వర్గాలను నారాయణస్వామి దూరం చేసుకున్నారు. ఈసారి నారాయణస్వామి పోటీ చేస్తే వ్యతిరేకించాలని మెజార్టీ సామాజిక వర్గం తీర్మానించుకుంది.
ప్రస్తుతం సీఎం జగన్ ఎన్నో రకాల సర్వేలు చేయించుకుంటున్నారు. నిఘవర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కటి కూడా నారాయణస్వామికి అనుకూలంగా లేనట్లు తెలుస్తోంది. కొందరు నేతలు నేరుగా సీఎం కే ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. నారాయణస్వామిని మార్చితే కానీ.. ఆ నియోజకవర్గంలో వైసీపీ గట్టెక్కడం కష్టమని తెలుస్తోంది. అందుకే ఈసారి నారాయణస్వామిని పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తెస్తారని తెలుస్తోంది. ఒకటి రెండు నెలల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఒక్క నారాయణస్వామితో ఆగుతుందా? లేకుంటే క్యాబినెట్లో మిగతా వారిపై సైతం వేటు వేస్తారా? వారిని పక్కకు తప్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.