YS Raja Reddy Engagement: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 18న ఆమె తనయుడు రాజారెడ్డి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థంతోపాటు, ఫిబ్రవరి 17న తన కుమారుడు రాజారెడ్డి – అట్లూరి ప్రియ వివాహానికి రావాలని షర్మిల తన అన్న జగన్‌తోపాటు అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. నిశ్చితార్ధం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
గోల్కొండ రిసార్ట్స్‌లో ఎంగేజ్‌మెంట్..
హైదరాబాద్‌లో జనవరి 18న రాజారెడ్డి–ప్రియ ఎంగేజ్‌మెంట్ జరుగనుంది. గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్‌లో ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ఏపీ సీఎం, షర్మిల సోదరుడు వైఎస్.జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు నారా లోకేష్ వస్తారని సమాచారం. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు షర్మిల కొడుకు నిశ్చితార్ధానికి వస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
జోధ్ పూర్ లో పెళ్లి..
ఇక ఫిబ్రవరి 17న రాజారెడ్డి – ప్రియ వివాహం రాజస్థాన్‌లోని జోధ్ పూర్ లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు కూడా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు వస్తారని తెలుస్తోంది.