కేంద్రం ‘మ‌మ‌త’ చూపుతుందా?

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ దాదాపుగా సీఎం ప‌ద‌విని వ‌దిలిపెట్టాల్సిందేన‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఎమ్మెల్యే కాకుండానే.. ఆమె ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించింది. కానీ.. మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ లో పోటీచేసిన ఆమె.. స‌మీప ప్ర‌త్య‌ర్థి సువేందు అధికారి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. ఉప ఎన్నిక‌లో తిరిగి గెలుస్తాన‌నే లెక్క‌లు వేసుకొని ఆమె సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే.. […]

Written By: Bhaskar, Updated On : July 9, 2021 12:43 pm
Follow us on

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ దాదాపుగా సీఎం ప‌ద‌విని వ‌దిలిపెట్టాల్సిందేన‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఎమ్మెల్యే కాకుండానే.. ఆమె ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించింది. కానీ.. మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ లో పోటీచేసిన ఆమె.. స‌మీప ప్ర‌త్య‌ర్థి సువేందు అధికారి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. ఉప ఎన్నిక‌లో తిరిగి గెలుస్తాన‌నే లెక్క‌లు వేసుకొని ఆమె సీఎం కుర్చీలో కూర్చున్నారు.

అయితే.. రాజ్యాంగం ప్ర‌కారం.. ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ సీఎం కావొచ్చు. కానీ.. ఆరు నెల‌ల్లో ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం సాధించాల్సి ఉంది. అలా కాని ప‌క్షంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆటోమేటిగ్గా ర‌ద్దైపోతుంది. ఇదే ఇప్పుడు మ‌మ‌తా ప‌ద‌వికి ఎస‌రు తెచ్చేలా ఉంద‌నే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మే 4వ తేదీన మ‌మ‌తా బెన‌ర్జీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. అంటే.. న‌వంబ‌ర్ 4లోగా ఆమె ఎమ్మెల్యేగా గెలిచితీరాలి. లేదంటే.. ఎమ్మెల్సీ కావాలి. కానీ.. బెంగాల్లో శాస‌న మండ‌లి లేదు. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది? అనే చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల‌ ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌థ్ సింగ్ రావ‌త్ ఇదే కార‌ణంతో రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఆయ‌న కూడా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన తీర‌త్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. సెప్టెంబ‌ర్ 5 లోగా ఆయ‌న గ‌డువు ముగుస్తుంది. ఈ లోగా ఉప ఎన్నిక నిర్వ‌హించాలని బీజేపీ ప్ర‌య‌త్నించినా.. ఎన్నిక‌ల సంఘం ససేమిరా అన్న‌ది. క‌రోనా సెకండ్ వేవ్ వేళ ఎన్నిక‌లు నిర్వ‌హించినందుకు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. దీనిపై న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పై హ‌త్య కేసు న‌మోదు చేయాల‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం దాదాపు అసాధ్యంగానే క‌నిపిస్తోంది.

మ‌మ‌త విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి ఎదురు కావొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితిని ఊహించిన మ‌మ‌తా బెన‌ర్జీ.. శాస‌న మండ‌లి ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు రాష్ట్ర శాస‌న‌స‌భ ఆమోదించి కేంద్రానికి తీర్మానం పంపించింది. మ‌రి, దీన్ని కేంద్రం ఎంత వ‌ర‌కు ఆమోదిస్తుంది అన్న‌ది ప్ర‌శ్న‌. కావాల‌ని ఆల‌స్యం చేసినా.. చేయొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విధంగా అన్ని దారులూ మూసుకుపోతే మాత్రం.. రాజీనామా చేసి, న‌మ్మిన బంటును సీట్లో కూర్చోబెట్ట‌డం త‌ప్ప‌, మ‌మ‌త‌కు మ‌రో ఆప్ష‌న్ లేన‌ట్టే.