Chandrababu Health: అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన జైలు జీవితానికి 50 రోజులు సమీపిస్తున్నాయి. మరోవైపు న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. ఇప్పట్లో దక్కే సూచనలు కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. జైలులో ఆయన ప్రాణానికి హాని పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఏకంగా ఏసీబీ న్యాయమూర్తికి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈనెల 25న జైలు అధికారుల ఆమోదముద్ర తో విడుదల చేశారు.ఈ లేఖలో బాబుతనను జైలులో అంతం అందించేందుకు భారీ ఎత్తున కుట్ర సాగుతుందని చెప్పుకున్నారు.దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ప్రారంభంలోనే ఆదేశించింది. ఇంటి భోజనానికి అవకాశం కల్పించాలని సూచించింది.అందుకు తగ్గట్టుగానే జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ ములాఖత్ లతో పాటు లీగల్ ములాఖత్ లను సైతం ఏర్పాటు చేశారు. అటు నిరంతర వైద్య సేవలు, పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. అయినా సరే జైలులో భద్రతతో పాటు చంద్రబాబు ఆరోగ్యం పై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఒకవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతనే తీసుకుందాం.. చంద్రబాబు ఉన్నది ఒక జైలు గదిలో కాదు. ఏకంగా ఒక బ్లాక్ మొత్తాన్ని ఖాళీ చేసి ఆయన కేటాయించారు. ఆ బ్లాక్ చుట్టూ ఏకంగా 24 సీసీ కెమెరాలను అమర్చారు. అవి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. ప్రతి రెండు రోజులకు డిఐజి ర్యాంక్ ఆఫీసర్ ప్రత్యక్షంగా చంద్రబాబు ఉన్న బ్లాక్ కు వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు.
చంద్రబాబును అక్రమంగా అవినీతి కేసుల్లో ఇరికించి అరెస్టు చేసి ఉండవచ్చు గాక.. కానీ ఆయన భద్రతకు భంగం వాటిల్లినా, ఆరోగ్యంపై నిర్లక్ష్యం జరిగినా అందుకు మూల్యం చెల్లించుకునేది జగన్ సర్కారే. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే జైలు అధికారులు సమక్షంలోనే మెరుగైన వైద్యం అందిస్తారు. కానీ ఆయనను చంపాలని ఎవరూ చూడరు. అలా చూసే క్రమంలో అత్యంత దెబ్బతినేది జగన్ సర్కారే. అయితే కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జగన్ సర్కార్ కు తిరిగి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో భాగంగానే ఈ ప్రయత్నం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు అనడం ద్వారాటిడిపి శ్రేణులతో పాటు కోట్లాదిమంది ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ తెప్పించే ప్రయత్నమేనని తేల్చి చెబుతున్నారు. మరోవైపు బెయిల్ సైతం జైలులో భద్రత, చంద్రబాబు అనారోగ్య సమస్యలు కారణంగా పనికి వస్తాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు.ఒకటి న్యాయపోరాటం,రెండు ప్రజల్లో సానుభూతికి ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.