
మన పైత్యం ఏ వైద్యానికీ లొంగనిది, మన వైద్యానికి తప్ప. అవును, ఈ వైద్య సమస్య సంప్రదాయానిదీ, సామాన్యులదీ, ఖర్చు తక్కువైనదీ కాదు కేవలం అది మనది కాదు, అంతే. అది మనం భూమిమీద గీసుకున్న ప్రాంతానిది కాదు, మనం వాడే భాషది కాదు, అదీ సమస్య. మందులకి కూడా మనం ఇంగ్లీషు వైద్యం అనే భాష, ప్రాంతీయత అంటగట్టడమే దాన్ని అంగీకరించలేని మన సమస్య.
మనదేశంలో ఒక కులం మాత్రమే యుద్దాలు ధరించే హక్కువల్ల శకులు, పహ్లవులు, గ్రీకులు, పార్థియనులు, అరబ్బులు, పర్షియన్లు, ఆంగ్లేయులు ఈ భూమిని మరీ మరీ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక కులం మాత్రమే పుస్తకాలు పట్టుకునే హక్కువల్ల అఙ్ణానాలు, మూర్కత్వాలు, పైత్యాలూ సాహిత్యాలూ, అయుర్వేదాలూ అయ్యాయి.
ఈ ఆయుర్వేదాలు ఎప్పుడు రాశారు? ఎవరు రాశారు? శిల్పం చెక్కాలన్నా మనిషి శవాల్ని కోసి ఏ రక్తనాళం ఎక్కడుందో పరిశీలించిన డావిన్సీ లాంటి శిల్పి, కాదు, వైద్యుడు మనకున్నాడా? పశువులు కోసే, కోసిన వాటిని తినే కిందికులస్తులు ఏ అయుర్వేద గ్రంధం రాశారు? అసలు జంతువుల తోలువలిచి చెప్పులు కుట్టే వాళ్లు విదేశాల్లో వైద్యంలో ఎంత గొప్ప పరిశోధనలు చేశారో మనకు తెలుసా? మరి దేశంలో వాళ్ళు ఏమైనా రాశారా? అడవుల్లో వున్న ఎంతమంది గిరిజనులు పుస్తకాలు రాశారు? పొలాల్లో పనిచేసే రైతు కూలీలు ఏ పుస్తకాలు రాశారు? మరెవరు రాశారు? జంతువ్లను కాదు మనుషులని కూడా ముట్టుకోనివాళ్లు, ఒక్క గింజ పండించనివాళ్లూ, ఒక్క పసరు తిననివాళ్లూ అదీ ఎప్పుడో రాసింది ఇప్పటికీ ప్రామాణికమని అనగలుగుతున్నామంటే విషయం ఎక్కడుంది?
ఏది తరాల విఙ్ణానం అంటే. వాళ్లది తరాల విఙ్ణానం కాదా? మనం ఆసుపత్రికిపోయినా, మందుల షాపుకి వెళ్ళినా అందుకునే వైద్యంలో మనం కనిపెట్టిన గుళికలెన్ని, వైద్య వస్తువులెన్ని, అమలుపరచబడుతోన్న పద్దతులెన్ని?
అసలు వ్యాధులు కలిగించే వైరస్‌కీ బ్యాక్టిరియాకీ తేడా మన వైద్యానికి తెలుసా? వాటి రూపాలు తెలుసా? ఏవి ఏ వ్యాధులు కలిగించగలవో తెలుసా? కనిపించే ఒక్క జంతువుమీదైనా మనం పరిశోధనలు చేసినప్పుడు కనిపించని ఏ జీవిమీదైనా పరిశోధన చేశామని అనగలమా?
భూమిలోని ఖనిజాల్ని, భూమిమీది జంతువుల కణాల్ని, గాలిలోని వాయువుల్ని మనం ఎప్పుడైనా పరిశీలించామా? సృష్టిలో ప్రతి నిర్మాణానికి కారణమైన మూలకాల్లో ఒక్కటైనా మనం కనుక్కోగలిగామా? మనం కనుక్కోగలిగింది ఒక్కటే, ముక్కోటి దేవతల్ని. అంటే దేశపు జనాభాకన్నా ఎక్కువ దేవతల్ని.
మనదే కాదు వాళ్లదీ సంప్రదయమే. తరాలుగా ఒకరినుండి ఒకరికి తెలివి తేటలే, కుశాగ్రబుద్దే, సాటి ప్రాణికి మేలుచేయాలన్న తలంపే, తమకు గుర్తింపు దక్కుతుందన్న నమ్మకమే లెక్కలేనన్ని అవిష్కరణలకు కారణం కాలేదా? ఇదే టీకాని ఎడ్వర్ జెన్నర్ వంటివారు తన శరీరాన్నే పరిశోధనలకు వాడలేదా? ప్రతి మందు, పద్దతీ, ఆలోచన సవరించుకుంటూ ఎదిగలేదా? ఇది కాదా ప్రామాణీకరణ? ఈ మార్పు కాదా అభ్యుదయకు సంకేతం?
అలాగని ఈ నేలమీద తరాలుగా గనుల్లో, పొలాల్లో, అడవుల్లో రకరకాల పనుల్లో సామాన్యుల వైద్యాన్నీ పద్దతులనీ ఇప్పటికీ ఎలాంటి మార్పులులేకుండా అంగీకరించడమంటే మన గతమ్మీద మర్యాద లేనట్లు కాదు, మన వర్తమనపు బ్రతుకుమీద గౌరవం లేనట్లు. అసలు మనలో చాలామందికి మన వైద్య విధానమ్మీద కనీస అవగాహనలేదు. ఆనందయ్య మందు అనగానే దుస్తులిప్పేసుకుని ఎగురుతున్నారేగానీ, అది ఆయుర్వేదం కాదని ప్రభుత్వ ఆయుష్ వైద్య విభాగం స్పష్టం చేసింది. 54 ఆయుర్వేద గ్రంధాలలో చెప్పని వైద్యం ఆయుర్వేదంగా చట్టం చెబుతోంది. కిందికులాలవాళ్ళూ, తెల్లవాడు వచ్చేదాక అక్షరం రాసుకోని కులాలు రాసిన వైద్యాన్ని పల్లెవైద్యం, నాటువైద్యం, మూలికావైద్యంగా పిలుచుకోమని చట్టం చెబుతోంది.
అంటే పరిశోధనలు లేని, నిలువనీరులా మార్పులేని, నిజమైన ప్రజా సంప్రదాయం కాని, అనుభవంలేని ఒక కులం రాసిన, ఎవరికీ చెందకుండా గుప్తంగా దాచిన సమాచార వైద్యమైన ఆయుర్వేదాన్ని తలకెత్తుకుందామా? లేక స్థానికంగా అరకొరగా ప్రాణాల్ని నిలుపుకోవడానికి, అప్పటి కాలానికి పనికొచ్చి, కనీస శాస్త్రీయతలేని నాటువైద్యాల్ని నమ్ముకుందామా? ముందు ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. ఇక మూడవది ఈ రెండూ కాకుండా ఈ దేశంలో ప్రతి మనిషీ తినే తిండిలోని ఆకుకూరలు, కూరగాయలు, దినుసుల్లో వైద్యం వుందందామా? దాన్ని గృహిణివైద్యం అందామా? అజీర్తిచేస్తే వాము, వీరోచనం కోసం ఆముదం, త్రేంపులకు ఆవాలు తినే కనీస అవగాహనని గృహవైద్యమందామా? ఆనారోగ్యమనిపిస్తే పెట్టిన అన్నం తినడం మానేసి గడ్డితిని తిరిగి వాంతి చేసుకునే వీధికుక్కకు కూడా వైద్యం తెలుసనుకుందామా?
ఈ భూప్రపంచమంతా నీది, నువ్వు ఎల్లలు తెలియని, కులమతాలు అంటని విశ్వనరుడవు అనుకున్నప్పుడు హేతుబద్దంగా, వాస్తవంగా, ప్రామాణీకరణంగా వుండే మందు ఎక్కడినుండి వచ్చినా దాన్ని ప్రాణం నిలబెట్టే సంజీవినిగా, అందులోని నిష్ణాతుడిని ప్రాణదాతగా గుర్తించగలవు. అఫ్‌కోర్స్ ప్రాణం నిలబెట్టేది హిమాలయాల్లో దొరుకుతుందని, దాన్ని మాత్రమే సంజీవిని అనాలనీ, దాన్ని తెచ్చే హనుమంతుడిని ప్రాణదాత అనాలని అనుకుంటే తల్లి కడుపులో వున్నప్పటినుండి పుట్టి, పెరిగి ఇంత పెద్దయ్యేవరకూ నిన్ను కాపాడిన వైద్యం పట్ల, వైద్యుల పట్ల కృతఙ్ణత లేనితనాన్ని ప్రకటించడం తప్ప మరోటి కాదు