
భారత దేశ చరిత్రలో బహుశా మొదటిసారిగా ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విబేధాలు విస్మరించి ఉమ్మడిగా కరొనపై పోరాటం చేస్తుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మాత్రం ఎందుకనో అసహనానికి గురవుతున్నారు.
కరొనపై పోరుకు ఉధృతంగా పనిచేయవలసింది పోయి ఈ వైరస్ తీవ్రతను రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు చూపేందుకు విఫల ప్రయత్నం చేయడం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది.
ఈ విషయమై ఆ రాష్త్రానికి చెందిన వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే కొలకత్తాతో పాటు మరో కొన్ని జిల్లాలు సహితం పరిస్థితులు అదుపుతప్పి పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు కేంద్రం పంపిన అంతర్ మంత్రివర్గ బృందం సోమవారం కోలకత్తాకు చేరుకొంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీబ్ సిన్హా కలసి బృందం పర్యటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర బృందం పర్యటిస్తే తన ప్రభుత్వ వైఫల్యాలు వెల్లడి అవుతాయని మమతా భయపడుతున్నట్లున్నది. కోవిద్ 19 వంటి తీవ్రమైన సవాల్ ఎదుర్కొనే సమయంలో కూడా మరోసారి రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్రంతో మమతా ఘర్షణ పూర్వక ధోరణికి తలపడడం విస్మయం కలిగిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం నిర్ధారణ చేసేవరకు కరొనతో చనిపోయిన వారి వివరాలు ప్రకటింపవద్దని రాష్ట్ర ప్రభుతం నిషేధం విధించినట్లు వైద్యులు వాపోతున్నారు. గత వారం కొలకత్తాతో పాటు మరో కొన్ని జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్ లుగా ప్రకటించినా ఆ జిల్లాల్లో తగు చర్యలు తీసుకోవడం గురించి మమతా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
మరోవంక కేంద్రం అవసరమైనన్ని కిట్ లను సరఫరా చేయడం లేదని అంటూ కేంద్రంపై మమతా నిందలు వేశారు. మొత్తం కొలకత్తా నగరానికి 40 కిట్ లు మాత్రమే పంపారని అంటూ వాపోయారు.
అయితే ఆమె ప్రకటన పట్ల కలరా, రాష్ట్రంలో కరోనా పరీక్షలకు మూలకేంద్రమైన అంటువ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్ డా. శాంతా దత్తా విస్మయం వ్యక్తం చేసారు. మొత్తం తూర్పు ప్రాంతానికి సరిపడిన 27,000 కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ఉపయోగించుకోవడం లేదని కూడా తెలిపారు.
ఈ మధ్య న్యూస్ ఛానల్స్ లో ప్రసారమైన ఒక వీడియో రాష్ట్రంలోని పరిస్థితుల పట్ల తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు కలిసి కరొనతో చనిపోయిన వారి వృతదేహాలను రహస్యంగా పారవేస్తున్నట్లు ఈ వీడియోలో చూపడం పెద్ద సంచలనం కలిగించింది.
ఈ సందర్భంగా ఈడెన్ హాస్పిటల్ లో జరిగిన దిగ్బ్రాంతి కలిగించే సంఘటనను వైద్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేస్తున్నారు. ఉత్తర కొలకత్తా లోని వైద్య కళాశాలలో గల ఈ హాస్పిటల్ లో చేరిన ఒక గర్భిణీ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెకు లేబర్ గదిలో శస్త్రచికిత్స చేశారు.
అక్కడ ఆమెను సుమారు 50 మంది నర్సులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిశారు. లేబర్ గది క్రిక్కిరిసి ఉంది. ఒకొక్క మంచంపై ముగ్గురు రోగులు ఉన్నారు. అక్కడ ఆమెను కలసిన మరి అనేక మందికి కూడా వైరస్ సోకి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.
ఈ సంఘటన గురించి తెలియగాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొదట ఆమెను కలిసిన 50 మంది సిబ్బందిని ఐసొలేషన్ కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కాదు 25 మందిని పంపిస్తున్నామన్నారు. చివరికి అందరిని విధులలో చేరమన్నారు.
ఈ సంఘటన ప్రమాదకరమైన కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న `నేరమయ నిర్లక్ష్యం’కు నిదర్శనమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నేడు ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి.
వైరస్ గురించిన వాస్తవాలను కప్పిపుచ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రమాదంనైనా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలను సేకరించడం పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదు.
కరోనా సోకిన్నట్లు నిర్ధారించిన తర్వాత చనిపోయిన ఏడుగురిని మృతుల జాబితాలో కలపలేదని అంటూ స్వయంగా శాస్త్రవేత్త అయినా సిపిఎం శాసనసభ్యురాలు డా. సుజన్ చక్రబోర్తి ఆరోపించారు.
ఒక కధనం ప్రకారం పశ్చిమ బెంగాల్ లో 10 లక్షల మందిలో 33.7 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరుపుతున్నారు. జాతీయ సగటు 156.9 గా ఉంది. రాజస్థాన్ లో అయితే 442 మందికి పరీక్షలు జరుపుతున్నారు.
ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని వదలని పక్షంలో కొలకత్తాతో పాటు మిడ్నపూర్, ఉత్తర – దక్షిణ 24 పరాగణాలు, ముర్షిదాబాద్, మాల్డా, దీనజపూర్ జిల్లాలలో కరోనా భీకరంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.