కరోనా టెస్ట్ ల వివాదంలో జగన్ ప్రభుత్వం!

మొదటి నుండి కరోనా వైరస్ కట్టడి పట్ల కాకుండా, రాజకీయ ఎజెండాలను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల శ్రద్ద వహిస్తూ విమర్శలకు గురవుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కరోనా టెస్ట్ ల వివాదంలో చిక్కుకొంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన రాజకీయ దుమారం ప్రజలలో భయాందోళనలను గురిచేస్తున్నది. తగు విధంగా కరోనా టెస్టులు చేయక పోవడంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉన్నదని ప్రతిపక్ష టిడిపి నేతలు […]

Written By: Neelambaram, Updated On : April 21, 2020 3:32 pm
Follow us on

మొదటి నుండి కరోనా వైరస్ కట్టడి పట్ల కాకుండా, రాజకీయ ఎజెండాలను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల శ్రద్ద వహిస్తూ విమర్శలకు గురవుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కరోనా టెస్ట్ ల వివాదంలో చిక్కుకొంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన రాజకీయ దుమారం ప్రజలలో భయాందోళనలను గురిచేస్తున్నది.

తగు విధంగా కరోనా టెస్టులు చేయక పోవడంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉన్నదని ప్రతిపక్ష టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, అధికార పక్షం మాత్రం దేశంలో చాలా రాష్ట్రాలలోకన్నా ఎక్కువగా టెస్టులు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో రోజుకు ఐదువేల టెస్టులు చేస్తున్నామని, ఈ సంఖ్యను 11,000 వరకు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అధికారులు ఈ విధంగా చెబుతుంటే సిఎం సొంత ఎజెండాను అమలు చేయడం కోసం కోవిడ్‌ తక్కువగా ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. దీంతో అసలు ఏం జరుగుతోందనేది అర్థంగాక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మరోవంక కరోనా మహమ్మారితో సంబంధం లేకుండా విశాఖకు రాజధానిని మార్చే ప్రయత్నంలో ఉన్న అధికార పక్షం రాష్ట్ర మంతటా కరోనా కేసులు పెరుగుతున్నా విశాఖ నగరంలో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నట్లు టిడిపి ఆరోపిస్తున్నది. ఒక్క కేసునైనా దాచామని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్‌ చేశారు.

విశాఖ నగరంలో దాదాపు 25లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభాలో కేవలం 2,530 మందికే ఇంతవరకూ పరీక్షలు జరిగాయి. విశాఖ కేంద్రంగా సీపోర్టు, ఎయిర్‌ పోర్టు ఉన్నందున విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా 3,117 మంది వచ్చినట్లు గుర్తించారు. వీరిలో చాలా వరకూ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. వీరికి కేవలం థర్మల్‌ స్క్రీనింగ్‌ మాత్రమే జరిపారు.

వాస్తవ కరోనా పరీక్షలు జరిపింది 0.1శాతం మంది (2,530)కి మాత్రమే! వీరిలో 2150 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఇంత తక్కువ మందికి పరీక్షలు జరపడమే విమర్శలకు కారణమవుతున్నది.

ఈ లోగా కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలుపై దుమారం చెలరేగింది. కొరియా నుండి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పింఛాయామని అంటూ తొలి టెస్ట్ ను ముఖ్యమంత్రి జగన్ చేయించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. వాటి ధరను ప్రభుత్వం అధికారికంగా చెప్పక పోవడంతో వివాదం చెలరేగింది.

ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి వేరే సందర్భంలో మాట్లాడుతూ తాము రాపిడ్ టెస్టు కిట్లను రూ.335కు కొనుగోలు చేశామని చెప్పడంతో రాపిడ్ టెస్టు కిట్ల రేటు ఎంతో చెప్పగలరా అని కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ మర్యాదగా ట్విట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ 730కు కొనుగోలు చేసిన్నట్లు అప్పటికే ప్రచారంలో ఉంది.

దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నుండి రూ 20 కోట్లు బేరం ఆడుకొని, కన్నా ప్రభుత్వంపై దాడి చేస్తున్నాడని అంటూ విజయసాయిరెడ్డి అనుచిత వాఖ్యలు చేయడంతో ఈ వివాదం దారితప్పింది. అప్పటి వరకు కేంద్రంలో బీజేపీ నేతలతో సఖ్యతతో ఉంటున్న విజయసాయిరెడ్డి పట్ల బిజెపి కేంద్ర నాయకులలో సహితం ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తున్నది.

దానికి కన్నా ఘాటుగా స్పందించారు. ‘కరోనా టెస్టింగ్‌ కిట్లపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారు. హైదరాబాద్‌లోని శాండర్‌ ఏజెన్సీకి ఒక్కో కిట్‌కు రూ.730 పర్చేజ్ ఆర్డర్‌ ఇచ్చారు. ఒక్కో కిట్‌ రూ.640 అని జవహర్‌ రెడ్డి చెబుతున్నారు. విశాఖ మెడ్‌టెక్‌లో రూ.1200కే కరోనా టెస్టింగ్‌ కిట్‌ అని సాక్షిలో రాశారు” అని ప్రభుత్వంలో ఈ విషయమై నెలకొన్న గందరగోళాన్ని బహిర్గతం చేశారు.

దానీతో ఏ ధరకు కొన్నామో చెప్పలేక ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. నేరుగా సమాధానం ఇవ్వకుండా మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లించామని, ఏ రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చెల్లిస్తుందో అదే ధర చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నామని అంటూ జగన్ డొంకతిరుగుడుగా సమాధానం ఇచ్చారు.

ఒక్కో ర్యాపిడ్‌ కిట్‌ను రూ.730కి కొనుగోలు చేశామని, ర్యాపిడ్‌ కిట్లను కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందని అంటూ మంత్రి ఆళ్ళ నాని కన్నాపై ఎదురు దాడి చేశారు.