తెలంగాణలో కరోనా చికిత్సకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి రూ.32 లక్షలు వసూలు చేసిన వైనం అందరినీ షాక్ కు గురిచేసింది.. ఇంకో ఆస్పత్రి 23 లక్షలు ముక్కుపిండి కొల్లగొట్టింది.. శవాలు కూడా ఇవ్వకుండా ఆస్పత్రులు డబ్బులు పిండుకున్నాయి. ఇవి పైసాలా? పెంకాసులా? పైసలు ముందు ప్రాణాలు కూడా లెక్కలేకుండా పోయాయి. కరోనా చికిత్సకు ఆస్తులు అమ్ముకుంటున్నవారు.. బంగారం పుస్తెలు తాకట్టుపెడుతున్న వారు ఎందరో ఉన్నారు. పక్కనున్న ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఆ జనాలు బతికిపోయారు. కరోనా టెస్టు కిట్ ల ధరలను ఈరోజు సీఎం జగన్ తగ్గించారు. కానీ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు కేసీఆర్ సార్? ఇంత నిర్లజ్జగా తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్న కళ్లుండి చూడలేక కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?
నీళ్లు, నిధులు, నియామకాలు.. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడింది వీటి మీదే.. నీళ్లొచ్చాయి.. నిధులు ఖర్చయ్యాయి. నియామకాల మాట దేవుడెరుగు.. తెలంగాణలోని కీలకమైన రెండు రంగాల్లో కేసీఆర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విద్య, వైద్యం. ప్రజలందరికీ ఇవి నిత్యావసరం.. కేజీ-టు పీజీ ఉచిత విద్యను అటకెక్కించిన కేసీఆర్ కార్పొరేట్ దోపిడీకి ద్వారాలు తీశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా వేళ అత్యంత కీలకమైన ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
మార్చి నెల మొదటి వారంలో రాష్ట్రంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష దాటింది. ఇంకా ఈ సర్కార్ కరెక్ట్‌గా టెస్టులు చేసి.. సరైన లెక్కలు చెప్తే ఇంకా ఆ సంఖ్య ఎప్పుడో మరో మూడు లక్షలు దాటేది. పక్క రాష్ట్రంలో ఇప్పటికే 35లక్షల టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో ఇంకా 11 లక్షల దగ్గరే ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది మన ప్రభుత్వం తీరు. దీనికితోడు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ప్రభుత్వం దాస్తోందనేది ప్రధాన ఆరోపణ. శ్మశాన వాటికల్లో కాల్చే శవాలకి.. ప్రభుత్వం చెబుతున్న మరణాల కూడా లెక్కలకు పొంతన లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ఇటీవల ఒకేరోజు 50 శవాలకు దహన సంస్కారాలు చేపడితే.. ఆ రోజు ప్రభుత్వం ప్రకటించిన కరోనా మృతుల లెక్క కేవలం 11 మందే.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు కోరుతున్నా.. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం కుమ్మక్కైందనేది ప్రధాన ఆరోపణ. పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చితే ఇక్కడ ఎందుకు చేర్చడం లేదనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నే.
‘ఎంతటి వీఐపీ అయినా సరే.. కరోనా వచ్చిందంటే గాంధీ ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి’ అంటూ కరోనా ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. కానీ.. కరోనా వచ్చిన ఏ ఒక్క లీడర్ కూడా గాంధీకి పోలేదు. ప్రైవేటు ఆస్ప్రతుల్లోనే చికిత్స తీసుకున్నారు. అంటే వారికే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం లేకుండా పోయిందన్నమాట. ఇక ట్రీట్‌మెంట్ కోసం పోయిన సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో పేషెంట్లను పట్టించుకోక.. టైంకి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వీడియోలు ఎన్నో బయటికి వచ్చాయి. స్వయానా ఓ టీవీ జర్నలిస్టుకు కూడా ఇన్‌టైంలో ట్రీట్‌మెంట్ అందక చనిపోయాడు. మరో సంఘటనలో గాంధీలో ఓ వృద్ధుడు కరోనాతో చనిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ డెడ్‌బాడీని ఎవరూ తీయలేదు. దీంతో ఆ దుర్వాసనతో తోటి పేషెంట్లు అక్కడి నుంచి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. దీనికితోడు డాక్టర్లు, నర్సులు పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇక ఖమ్మం జిల్లాలో అయితే ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఇళ్ల నుంచి క్యారియర్లు తెప్పించుకుంటున్నారు. ఇదే పరిస్థితి అంతటా కనిపిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాల్సిన సర్కార్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నట్లు..? ప్రైవేటు హాస్పిటల్స్‌ను బతికించేందుకేనా..? అన్న ప్రశ్న సామాన్యుల్లో ఉదయిస్తోంది.
Also Read: ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?
కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి సీఎం కేసీఆర్ ఎంతో నేర్చుకోవాలి. మొదటి నుంచీ అక్కడి ప్రభుత్వం దూకుడుగా టెస్టులు చేస్తోంది. ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకూ కళ్లెం వేసింది. తాము నిర్ణయించిన ధరలనే తీసుకోవాలని హుకూం జారీ చేసింది. అక్కడ అధికారులు.. మంత్రులు, సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అలాంటివి ఏవీ అమలు కావడం లేదు. సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రాణాలు దక్కించుకోవాలని కార్పొరేట్ బాట పట్టిన పలువురు పేదలకు చుక్కలు చూపిస్తున్నారు. ముక్కుపిండి లక్షలు వసూలు చేస్తున్నారు. మొత్తం బిల్లు కట్టేదాకా శవాలను కూడా ఇవ్వడం లేదు. ఏదో నామమాత్రంగా రెండు హాస్పిటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్ క్యాన్సిల్ చేసిన సర్కార్.. తదుపరి హాస్పిటల్స్ మీద చర్యలకు వెనుకడుగు వేసింది. ఇది ఎందుకో అందరికీ తెలిసిన విషయమే..!
ఇక ఎన్ని విమర్శలు వచ్చినా ఒకే ఒక దెబ్బతో కేసీఆర్ వాటిని పటాపంచలు చేయడం ఆయన నైజం. ఆర్టీసీ కార్మికులు అన్ని రోజులు సమ్మె చేసినా తిట్టిపోసినా వారికి భోజనాలు పెట్టి 100 కోట్లు నిధులు, జీతాలు ఇచ్చి కూల్ చేశాడు. ‘దిశ’ హత్యాచారంలోనూ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు వచ్చిన వేళ నలుగురి ఎన్ కౌంటర్ తో దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగింది. ఇక కల్నల్ సంతోష్ మరణంపై స్పందించక విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ చివరకు ఆమె స్థలం, ఉద్యోగం.. సకల సౌకర్యాలు కల్పించి ఒక్కసారిగా హీరోగా అయ్యాడు. ఇలా ఒక్కటేమిటీ.. ప్రతీ విషయాన్ని తెగదాకా నాన్చడం.. అనంతరం దానకర్ణుడిలా డబ్బులు పంచి ఒక్కసారిగా హీరో అయిపోవడం కేసీఆర్ నైజం అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో అధ్వానంగా ఉన్న కరోనాకు కూడా చివర్లో ఏదో ట్విస్ట్ ఇచ్చి మళ్లీ మార్కులు కొట్టేస్తాడని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఈ ఉపద్రవంపై కేసీఆర్ సార్ ఏం చేస్తాడో చూడాలి మరీ..