
ఏపీలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి రాజకీయ నాయకులు జంప్ చేయడం సాధారణంగా జరిగేదే. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఇతర పార్టీలలోని ముఖ్య నేతల చేరికలను ఆహ్వానిస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరగా ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముఖ్య టీడీపీ నేత వైసీపీలోకి చేరడానికి సిద్ధమయ్యాడు.
Also Read : టీడీపీ ఆయువుపట్టుపై కొడుతున్న వైసీపీ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ఇప్పటికే వైసీపీలో చేరగా గంటా సహా ఇతర ముఖ్య నేతలు త్వరలో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక బలమైన నేత వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం జరిగింది. కాకినాడకు చెందిన చెలమల శెట్టి సునీల్ స్థానికంగా మంచి పేరు ఉన్న నేత.
ఎంపీ కావాలనే లక్ష్యంతో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా మూడుసార్లు ఆయనను ఓటమే పలకరించడం గమనార్హం. మొదట 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన 2014లో వైసీపీ నుంచి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. కాపు వర్గానికి చెందిన సునీల్ కు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే వచ్చే వారం ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?