హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీని గట్టెక్కంచడానికి సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఎన్నికలైనా కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించే కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకుని హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ప్రత్యేక అధికారాలు ఇస్తూ హరీశ్ రావును రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైన పార్టీని విజయతీరాలకు చేర్చాలని శ్రమిస్తున్నారు. రాష్ర్టంలో ఎ ఎన్నికలైనా కేటీఆర్ కు అప్పగించే కేసీఆర్ ఈసారి మాత్రం హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించడంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
హరీశ్ రావు హుజురాబాద్ లోనే మకాం వేసి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని భావిస్తున్నారు. పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈటల పై తీవ్ర స్తాయిలో విమర్శలు చేస్తూ ఆయన మార్గాన్ని అడ్డుకునేందకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హుజురాబాద్ లో విజయం అంటే మాటలు కాదని తెలియడంతోనే కేటీఆర్ ను కాదని హరీశ్ రావుకు బాధ్యతలు కేటాయించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు అయితేనే హుజురాబాద్ లో సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో కేసీఆర్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ లో ఉద్యమకారులకు ద్రోహులకు మధ్య పోటీ నెలకొందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులను దగ్గరకు తీసుకుని పదవులు ఇస్తున్నారని ఈటల విమర్శలు చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్న హరీశ్ రావు అయితేనే ఈటలను సమర్థంగా ఎదుర్కొంటాడనే నెపంతో ఆయనను బరిలో దింపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈటలకు కేసీఆర్ కన్నా హరీశ్ రావే సన్నిహితుడని తెలిసిందే. అందుకే ఇద్దరికి బాగా కుదురుతుందని భావించి సమఉజ్జీలనే ఉద్దేశంతో ఇద్దరిని పోటీ దారులను చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల, హరీశ్ రావే మార్గనిర్దేశం చేసినట్లు తెలిసిందే. అందుకే ఉద్యమ నాయకుడిని ఢొకొట్టేందుకు మరో ఉద్యమ నేత కావాలని హరీశ్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. హరీశ్, ఈటల మధ్య మంచి రసవత్తర పోరు జరగనుంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వ్యూహంలో ఒక భాగమే హరీశ్ రావును రంగంలోకి దింపడం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.