హుజురాబాద్ లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ పరస్పర దాడులకు తెగబడుతున్నారు. గురువారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఈటల రాజేందర్ పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. హుజురాబాద్ లో ఓటమి ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు అంధకారంలో కనబడడంతో రూ. కోట్ల నిధులు కుమ్మరస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఓట్టు అడిగేవారు నాయకులని, కొనే వారు వ్యాపారులని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ అన్ని మరిచి పోయి దిగజారిపోయి కోట్లు ఖర్చు చేస్తూ తన ప్రతిష్ట నిలుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. హుజురాబాద్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిష్టవేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టమంతా ఇదే పద్దతిలో ఖర్చు చేస్తే ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలుస్తుందా అని ప్రశ్నించారు.
హుజురాబాద్ లో ఏం జరుగుతోందనే విషయంపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోందని అన్నారు. నిధుల వరద పారిస్తుంటే ఎవరు అడ్డుకోలేరని అనుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ డబ్బులు సంచుల కొద్ది పారబోస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు. దేశద్రోహులకు సీఎం పట్టం కడుతున్నారని అన్నారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు విసిరిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు.
హుజురాబాద్ లో దళితుల ఓట్లు చీల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రెండు పార్టీలు చీకట ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. ఈటల రాజేందర్ ప్రధాని మోడీ ఫొటో పెట్టుకుంటే ఓట్లు రావని భావించి ఈటల ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జెండాను పక్కన పెట్టి తన ఫొటో తోనే ప్రచారం కొనసాగిస్తున్నారని తెలిపారు. మంత్రి హరీశ్ రావు ఈటల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో టీఆర్ఎస్ చూపిస్తుందని తేల్చి చెప్పారు.
బీజేపీకి ఓటేస్తే వచ్చే సంవత్సరంలో పెట్రోల్ ధరలు రూ.200 చేరుకుంటుందని, గ్యాస్ ధర రూ.1500 అవుతుందని చెప్పారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందని హరీశ్ జోస్యం చెప్పారు. ఈటల గెలిస్తే అధోగతి ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయంతోనే అందరికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు దృష్టి పెట్టడంతో రాజకీయం మరింత హాట్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.