హైదరాబాద్ ఎందుకు మునుగుతోంది?

గ‌తేడాది కురిసిన వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ ఏ స్థాయిలో అల్ల‌క‌ల్లోలం అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. జంట‌న‌గ‌రాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆస్తిన‌ష్టంతోపాటు ప్రాణ‌న‌ష్టం కూడా సంభ‌వించింది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార‌, విప‌క్షాలు పోటాపోటీగా విమ‌ర్శ‌లు గుప్పించుకున్నాయి. హైద‌రాబాద్ అభివృద్ధిపై ఉత్త‌ర‌కుమార మాట‌లు మాట్లాడారు. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రోసారి హైద‌రాబాద్ మునిగిపోయే దుస్థితి నెల‌కొంది. గ‌డిచిన రెండు వారాలుగా వ‌రుస‌గా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. […]

Written By: Bhaskar, Updated On : July 23, 2021 4:28 pm
Follow us on

గ‌తేడాది కురిసిన వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ ఏ స్థాయిలో అల్ల‌క‌ల్లోలం అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. జంట‌న‌గ‌రాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆస్తిన‌ష్టంతోపాటు ప్రాణ‌న‌ష్టం కూడా సంభ‌వించింది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార‌, విప‌క్షాలు పోటాపోటీగా విమ‌ర్శ‌లు గుప్పించుకున్నాయి. హైద‌రాబాద్ అభివృద్ధిపై ఉత్త‌ర‌కుమార మాట‌లు మాట్లాడారు. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రోసారి హైద‌రాబాద్ మునిగిపోయే దుస్థితి నెల‌కొంది.

గ‌డిచిన రెండు వారాలుగా వ‌రుస‌గా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ గ్యాప్ లో ఏకంగా 20 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. దీంతో న‌గ‌రంలో మురుగు కాల్వ‌లు పొంగొ పొర్లాయి. రోడ్లు మొత్తం జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇప్ప‌టికే లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న‌వారి ఇళ్ల‌లోకి నీళ్లు వ‌చ్చేశాయి. న‌గ‌రంలో, శివార్ల‌లో ఉన్న‌ చెరువుల‌న్నీ నిండు కుండల్లా ఉన్నాయి. మ‌రో మూడ్నాలుగు సెంటీ మీట‌ర్ల వాన కురిస్తే.. దాదాపు 50 చెరువుల ప‌రిధిలోని కాల‌నీలు మునిగిపోయే ప్ర‌మాదం నెల‌కొంది.

ఈ నెల‌లో రికార్డు స్థాయిలో వ‌ర్షం కురిసింది. వ‌ర్షాకాలం మొత్తం కుర‌వాల్సిన సాధార‌ణ వ‌ర్ష‌పాతం మొత్తం.. ఈ రెండు వారాల్లోనే కుర‌వ‌డం గ‌మ‌నార్హం. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిశాయి. గ‌డిచిన రెండు వారాల్లో ప‌లు చోట్ల 25 సెంటీమీట‌ర్ల నుంచి గ‌రిష్టం 40 సెంటీ మీట‌ర్ల వ‌ర‌కు కురిసింది. హ‌య‌త్ న‌గ‌ర్ ఉప్ప‌ల్‌, మ‌ల్కాజిగిరి, మారేడుప‌ల్లి ముషీరాబాద్‌, స‌రూర్ న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో.. 400 మిల్లీ మీట‌ర్ల‌పైన వ‌ర్షం కురిసింది. రానున్న రోజుల్లో ఇంకా వ‌ర్షాలు కురిస్తే చాలా ప్రాంతాలు నీట మునిగిపోవ‌డం ఖాయంగా ఉంది.

మ‌రి, ప్ర‌తిఏటా ఇదే ప‌రిస్థితి వ‌స్తుంటే ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయి అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ ప‌రిస్థితి అస‌లు ఎందుకు వ‌చ్చింది అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. నిజానికి చ‌రిత్ర‌లోకి వెళ్తే.. అద్భుత‌మైన ప్ర‌ణాళిక‌లతో, ముందు చూపుతో చెరువుల‌ను నిర్మించిన చ‌రిత్ర హైద‌రాబాద్ కు ఉంది. గొలుసుక‌ట్టు నిర్మాణంతో చేప‌ట్టిన ఈ చెరువుల వ‌ల్ల వ‌ర‌ద ముంపు అనే స‌మ‌స్యే ఉండేది కాదు. ఒక చెరువు నిండితే.. దాని అలుగు ద్వారా పారే అద‌న‌పు నీరు.. కింది చెరువుకు వెళ్లిపోయేది. ఇలాంటి ప్ర‌క్రియ సాఫీగా సాగ‌డంతో వ‌ర‌ద ముప్పుకు అవ‌కాశ‌మే ఉండేది కాదు. కానీ.. రాను రానూ ప‌రిస్థితి మొత్తం మారిపోయింది.

గ‌డిచిన ప‌లు ద‌శాబ్దాల కాలంలో నాలాలు ప్ర‌ధానంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. నీరు పారే ప్రాంతాల‌ను ఆక్ర‌మించుకొని నిర్మాణాల‌ను క‌ట్టేయ‌డంతో.. నీరు పోవ‌డానికి అవ‌కాశం లేకుండాపోయింది. అదే స‌మ‌యంలో న‌గ‌రంలోని సైడు కాల్వ‌లు కూడా కావాల్సినంత విశాలంగా లేక‌పోవ‌డం.. అవి చెత్తాచెదారంతో నిండిపోవడం.. వంటి కార‌ణాల‌తో వ‌ర్ష‌పు నీరు సాఫీగా ప్ర‌యాణించ‌లేక‌పోతోంది. దీంతో.. అనివార్యంగా నీరు రోడ్ల‌పై నిలిచిపోతోంది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉళ్ల‌ను ఇళ్ల‌ను ముంచెత్తుతోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలో ఉస్మాన్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, తూర్పు ఆనంద్ బాగ్‌, స‌ఫిల్ గూడ‌, ఎన్ఎండీసీ కాల‌నీ, మీర్ పేట త‌దిత‌ర ప్రాంతాల ప‌రిధిలోని చెరువు నీరు ఆయా ప్రాంతాల‌ను చుట్టుముట్టింది.

ఇది ఒక్కసారితో పోయే స‌మ‌స్య కాదు. నాలాల‌ను గ‌తంలో మాదిరిగా విస్త‌రించ‌క‌పోతే.. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌క‌పోతే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఎదురయ్యే స‌మ‌స్యే ఇది. మ‌రి, దీనిపై స‌ర్కారు ఎంత చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నదానిపైనే.. హైద‌రాబాద్ నీట మున‌గ‌డం అనే స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భిస్తుంది.