Ganga River : పుష్కరాలు, కుంభమేళాలు అవుతున్న సమయంలో చాలా మంది పవిత్ర స్నానాలు ఆచరించడానికి వెళ్తుంటారు. ఇలా వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఇలాంటి ప్రత్యేకమైన వాటికి వెళ్లి స్నానం చేసిన తర్వాత తప్పకుండా కొన్ని నీటిని తీసుకొస్తుంటారు. ముఖ్యంగా గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటిని ఏదో విధంగా తీసుకొస్తారు. వీటిని ఇంటి మొత్తానికి చల్లుతారు. వెంటనే వీటిని వాడేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటారు. సాధారణంగా మనం తాగడానికి వాడే నీరు కొన్ని రోజులకు పాడవుతుంది. కానీ గంగా నది నుంచి తీసుకొచ్చిన నీరు ఎన్ని రోజులు అయినా కూడా పాడవదు. అసలు గంగా నది నీరు చెడిపోకుండా ఎందుకు నిల్వ ఉంటుంది? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు గంగా నదిలో స్నానం ఆచరిస్తుంటారు. అక్కడ నీటిని ఇంటికి తీసుకొచ్చి ఉంచుతారు. ఇందులో స్నానం చేయడం వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయని అంటారు. ఈ నీటి వల్ల అసలు ఇన్ఫెక్షన్ కూడా రాదని పరిశోధకులు చెబుతున్నారు. గంగానది నీటిలో సెల్ఫ్ క్లీనింగ్ బ్యాక్టీరియోఫేజ్‌లు ఉన్నాయి. ఇవి ఆ నీరు చెడిపోకుండా కాపాడతాయి. దీంతో ఎవరికి కూడా చర్మ సమస్యలు రావని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. గంగా నది నుంచి తీసుకెళ్లిన నీటిపై వీరు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో హరిద్వార్ నుంచి గౌముఖ్, హరిద్వార్ నుంచి పాట్నా, పాట్నా నుంచి గంగాసాగర్ వరకు ప్రవహించే నీరును తీసుకున్నారు. వర్షం పడక ముందు, వర్షం పడిన తర్వాత పరిశోధకులు నీరు తీసుకెళ్లారు. కేవలం నీరు మాత్రమే కాకుండా మట్టి, గంగా తీరంలో ఉన్న ఇసుక వంటివి తీసుకెళ్లి కనుగొన్నారు. గంగా నది నీరు ఎన్ని రోజులు అయినా కూడా కలుషితం కాకుండా నిల్వ ఉంటుందని తెలిపారు. ఇందులో మూడు అంశాలు ఉన్నాయని అవి నీటిని శుద్ధి చేస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గంగా జలంలోని బ్యాక్టీరియా ఫేజ్‌లు మురికి బారిన పడకుండా కాపాడతాయి. ఇది వ్యాధికారక బాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేలా పనిచేస్తుందట. గంగా నది నీటిలో ఆక్సిజన్ కరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంగా నీటిలో దాదాపుగా 20 మి.లీ వరకు ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించారు. కుంభ సమయంలో ఎందరో స్నానాలు చేస్తున్నారు. కానీ వీళ్లకి ఎవరికి ఏం కాదట. గంగా నది తన మలినాన్ని తానే శుభ్రం చేసుకునే శక్తి కూడా ఉందట. గంగా నదిలో ఎందరు స్నానాలు చేసినా కూడా మూడు లేదా నాలుగు రోజుల తనని తాను శుద్ధి చేసుకుంటుందట.