PM Modi- Pawan Kalyan: ఊరికే రారు మహానుభావులు అని.. 2014 తర్వాత కలవని కలయిక ఇప్పుడు కలిసేసరికి అందరికీ అనుమానాలు వస్తున్నాయి.. మోడీ విశాఖ పర్యటన ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. దీని వెనుక ఎన్ని అభివృద్ధి పనులు ఉన్నా కానీ.. అంతిమ లక్ష్యం ‘రాజకీయమే’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముచ్చటగా మూడోసారి గెలవడం కోసం దూరమైన పాత మిత్రుల స్థానంలో కొత్త మిత్రులను దగ్గరకు తీసుకునే పనిలో మోడీ ఇప్పుడు కాస్త తగ్గారు. అందుకే ఇన్నాళ్లు పట్టించుకోని పవన్ కళ్యాణ్ ను సైతం ఇప్పుడు పలకరిస్తున్నారు. 2024 లో గెలవాలంటే ఇలాంటి ఆప్యాయతలు తప్పవు మరి.

మోడీ గద్దెనెక్కాక ఆయన రాజకీయానికి బాధితులుగా మారిన బీహార్ సీఎం నీతీష్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇక శివసేన ఎప్పుడో బీజేపీకి హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు అనుభవిస్తోంది. పంజాబ్ లోని శిరోమణీ అకాలీదళ్ సహా చిన్న పార్టీలన్నీ బీజేపీకి దూరమయ్యాయి. మర్రిచెట్టు లాంటి బీజేపీకింద ఎదగలేమని స్వతంత్రంగా బతుకుతున్నాయి. ఇక తెలంగాణలో పాగా వేయడం కోసం టీఆర్ఎస్ తోనూ బీజేపీ ఫైటింగ్ కు దిగింది. 2024లో ఏమన్నా తేడా వస్తే మిత్రుల సాయం అవసరం. అందుకే రెండు సార్లు ప్రధాని అయ్యాక కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోడీ.. ఇప్పుడు పవన్ ను స్వయంగా పిలవడం వెనుక మర్మం ఇదేనంటున్నారు. ఈ మీటింగ్ ఇక బీజేపీకి జనసేనకు మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని తెలుస్తోంది.
నిజానికి ప్రధాని పర్యటనలో పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు. కలుస్తానని అపాయింట్ మెంట్ కూడా అడగలేదు. ఎందుకంటే ఇదివరకూ కలుస్తానంటే పవన్ కు ఆహ్వానం అందలేదు.కానీ ఇప్పుడు స్వయంగా పవన్ ను మోడీ పర్యటనకు రావాలని పీఎం ఆఫీస్ కబురు పంపింది. శుక్రవారం సాయంత్రం ఐఎన్ఎస్ డేగలో కలుద్దామని సమాచారం పంపారు. ప్రధాని పిలిచారు కాబట్టి పవన్ వెళుతున్నారు కలుస్తున్నారు. అదంతా రాజకీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు..
బీజేపీ-టీడీపీ ప్రభుత్వాన్ని 2014లో గెలిపించడంలో పవన్ సాయం చేశారు. ఏపీ సమస్యలపై విసుగు చెంది అనంతరం ఈ రెండు పార్టీలకు దూరం జరిగారు. టీడీపీ హయాంలోనే ధర్మవరం చేనేత సమస్యలపై మోడీని కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగినా నాడు పవన్ కు దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కూడా మోడీ అపాయింట్ మెంట్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించారు. కానీ దొరకలేదు.
పవన్ ఎన్నికల్లో తనూ ఓడడం.. ఆయన పార్టీ దారుణంగా పడిపోవడంతో బీజేపీ నేతలు పెద్దగా జనసేనాని పట్టించుకోలేదన్నది వాస్తవం. ఆ మధ్యన పవన్ ను సీఎం క్యాండిడేట్ గా కూడా ఇదే బీజేపీ నేతలు గుర్తించలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో పొత్తులో ఉన్నామని ప్రకటించాయి. బీజేపీ నేతల తీరుతో విసిగిపోయిన పవన్ జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ సొంతంగా పోరాడుతున్నారు. జగన్ పై ఉవ్వెత్తున లేస్తూ జనాల్లో పాపులారిటీ సంపాదించారు.

ప్రజల్లో పోయిన పవన్ పరపతి ఇప్పుడు పెరగడంతోనే బీజేపీకి జనసేనాని అవసరం పడిందన్నది కాదనలేని సత్యం. ఇన్నాళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీజీ ఇప్పుడు స్వయంగా పిలవడం వెనుక కారణం అదే. వీరిద్దరి భేటి ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. జగన్ కు కేసుల ఉచ్చు ఉండడంతో మోడీతో పవన్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ పై జగన్ దమనకాండకు ఇకనైనా చెక్ పడే అవకాశాలు ఉంటాయి. బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తే.. టీడీపీని కలుపుకుంటే వైసీపీకి దబిడదిబిడనే..
ఏపీ రాజకీయాల్లో మోడీ-పవన్ భేటితో ఇక వైసీపీతో చెలిమి లేదని బీజేపీ క్లియర్ కట్ మెసేజ్ పంపుతోంది. పవన్ ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అని బీజేపీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ను చూసే దృక్కోణం కూడా వైసీపీకి మారుతుంది. కాస్త భయపడి వెనక్కి తగ్గే పరిస్థితులు ఉంటాయి. పోయిన చోట వెతుక్కొని సాధించిన ఘనత మాత్రం పవన్ కే దక్కుతుంది.