https://oktelugu.com/

TRS Praja Rajyam Alliance: 2009లో టిఆర్ఎస్, ప్రజారాజ్యం పొత్తు ఎందుకు విఫలమైంది.. కేసీఆర్ ను ఆపింది ఎవరంటే

2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు టిడిపి తో విభేదించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసుకున్న కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2023 / 05:11 PM IST

    TRS Praja Rajyam Alliance

    Follow us on

    TRS Praja Rajyam Alliance: 2009 ఎన్నికల్లో కెసిఆర్ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలని భావించారా? కానీ అప్పటి టిఆర్ఎస్ శ్రేణులు ఒప్పుకోలేదా? కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఇదే చెప్పుకొచ్చారు. అదే జరిగి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇంకోలా ఉండేది. ఇప్పటికీ ప్రజారాజ్యం సజీవంగా ఉండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాడు పొత్తు పెట్టుకుని గౌరవప్రదమైన సీట్లను ప్రజారాజ్యం దక్కించుకొని ఉంటే.. 2014లో గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు ఉండేవి. ప్రజారాజ్యం పార్టీ సైతం ఇప్పటివరకు కొనసాగేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు టిడిపి తో విభేదించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసుకున్న కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తరువాత అదే పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. 2009లో అనూహ్యంగా తెలుగుదేశం, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు. అయినా సరే ఓటమి ఎదురైంది. అయితే నాడు త్రిముఖ పోటీయే మహాకూటమి ఓటమికి కారణమని.. ప్రజారాజ్యం ఎంట్రీ తోనే గండి పడిందని.. రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి దోహద పడిందని విశ్లేషణలు ఉన్నాయి.

    ఆ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను బరిలోదించారు. అప్పట్లో అధికార పార్టీగా కాంగ్రెస్, ప్రధాన విపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ టిడిపి నుంచే ఎక్కువ మంది నాయకులు పిఆర్పి లో చేరారు. అయితే అప్పట్లో కెసిఆర్ సైతం ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ గెలవాలన్న కసితో పని చేస్తోంది.అందుకే ఆ పార్టీతోనే కూటమి కట్టాలని టిఆర్ఎస్ నేతలు సూచించారు. అందుకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ.. ఓ ఉద్యమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ఏపీలో ఇబ్బందులు వస్తాయని భావించి ముందుకు రాలేదని తెలుస్తోంది.

    అయితే ఆ ఎన్నికల్లో అటు టిఆర్ఎస్, ఇటు ప్రజారాజ్యం పార్టీ సైతం దారుణంగా దెబ్బతిన్నాయి. త్రిముఖ పోటీ పుణ్యమా అని.. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగలిగింది. ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. అక్కడకు కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది పిఆర్పి. అయితే అప్పట్లో టీఆర్ఎస్ మహాకూటమి వైపు వెళ్లకుండా.. ప్రజారాజ్యం పార్టీతో కలిసి వెళ్లి ఉంటే మంచి ఫలితాలు దక్కేవని ఒక అభిప్రాయం ఉంది. అప్పట్లో రెండు పార్టీలు కలిసి కూటమి కట్టి.. 50 సీట్లకు మించి స్థానాలు దక్కించుకొని ఉంటే.. తెలంగాణలో కెసిఆర్ మాదిరిగానే.. ఏపీలో చిరంజీవి సీఎం అయ్యే అవకాశం ఉండేదని తాజాగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అసలు వైసీపీకి ఏపీలో చోటు దక్కే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2014 ఎన్నికల్లో రాజకీయ శున్యత చిరంజీవికి కలిసి వచ్చి ఉండేదని.. కానీ 2009 ఎన్నికల్లో నిర్ణయం ప్రతిబంధకంగా మారిందని.. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ తరహా విశ్లేషణలు వెలువడుతున్నాయి.