https://oktelugu.com/

KA Paul: మోడీకి మంద కృష్ణ అమ్ముడుపోయాడట.. 25 కోట్లు అడిగాడట?

ఇటీవల హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విశ్వరూప సభ పేరుతో భారీ మీటింగ్ ఒకటి నిర్వహించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 14, 2023 / 05:17 PM IST

    KA Paul

    Follow us on

    KA Paul: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. సంచలన ఆరోపణలతో సెగలు రేపుతోంది. ఇందులో విమర్శలున్నాయి.. ప్రతి విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నాయి. హస్తిమ శకాంతరం విమర్శలూ ఉన్నాయి. మిగతా వారు ఎలా ఉన్నా.. వారు చేసే కామెంట్లు ఎలాంటివైనా పెద్దగా నవ్వు రాదు. కానీ కేఏ పాల్ లాంటి వ్యక్తి మాట్లాడితే మాత్రం నవ్వొస్తుంది. సీరియస్ గా సాగే సినిమాలో బ్రహ్మానందం చేసే కామెడీ లాగా అనిపిస్తుంది.

    మోడీకి అమ్ముడుపోయారట

    ఇటీవల హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విశ్వరూప సభ పేరుతో భారీ మీటింగ్ ఒకటి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. దళితుల వర్గీకరణకు సంబంధించి కమిటీ వేస్తామని ప్రకటించారు. ఇందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన ప్రకటించారు.. సహజంగానే ఎన్నికలకు ముందు ఇలాంటి ఒక గేమ్ చేంజర్ లాంటి నిర్ణయం తీసుకోవడంతో అది బిజెపికి లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సభ సందర్భంగా మోడీ భుజాన్ని పట్టుకొని మందకృష్ణ మాదిగ ఏడ్చిన సన్నివేశం కూడా చాలామంది హృదయాలను కదిలించింది. అయితే ఈ విశ్వరూప సభ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు మాత్రం డిఫెరెంట్ గా కనిపించింది.. అందుకే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వరూప సభ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మందకృష్ణ అమ్ముడుపోయారని ఆరోపించారు. దళితుల అభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.

    అప్పట్లో 25 కోట్లు అడిగారు

    అంతటితోనే కేఏ పాల్ ఆగలేదు. తన ప్రజాశాంతి పార్టీలోకి రావాలని మందకృష్ణను అడిగితే 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని పాల్ ఆరోపించారు. దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకే నరేంద్ర మోడీ విశ్వరూప సభకు హాజరయ్యారని పాల్ విమర్శించారు. అయితే ఇదే కేఏ పాల్ తాజాగా ఓవిలేకరుల సమావేశంలో బాంబు పేల్చే మాటలు మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదా ఓటర్లు మొత్తం నోటా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ మందకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగానే అన్వయం లేకుండా మాట్లాడే కే ఏ పాల్.. ఇటీవల మరింత రెచ్చిపోతున్నారు. మోకాలికి బోడి గుండుకు లంకె వేస్తూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. కె ఏ పాల్ మాట్లాడే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.