2000 Note Withdraw: నల్లధనం అనేది మన వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు.. ఇతరత్రా చీకటి వ్యాపారాలు సాగించేవారు నల్ల సొమ్ముకు బాగా అలవాటు పడ్డారు. వీకి లీక్స్, ఫనమా ఫైల్స్, పెద్దపెద్ద దర్యాప్తు సంస్థలు నల్ల సొమ్ము వివరాలు బయట పెడితే ఇంతవరకు వారిపై తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, అధికారంలో ఉన్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు ఇందుకు ఎవరూ కూడా మినహాయింపు కాదు.. అయితే 2016లో అకస్మాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1000, 500 నోట్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నల్లధనం నియంత్రణలోకి వస్తుందని అప్పట్లో ఆయన వివరించారు. నోట్ల రద్దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సాహయస్థితిలో కూరుకుపోయింది. అనివార్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2000 నోటును తీసుకొచ్చింది. కానీ ఇది కూడా నల్లధనం మరింత పెరిగేందుకు ఉపకరించింది. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో దీనికి అనుగుణంగానే ముందస్తుగా ఏర్పాటు చేసింది. ఈ ప్రస్తావనను పక్కనపెడితే అసలు నోట్ల రద్దు వల్ల నల్లధనం కట్టడి అయ్యిందా, ఆ రద్దు నిర్ణయం వల్ల దేశానికి ఏం ప్రయోజనం చేకూరిందో మీరూ చదివేయండి.
ఇవీ వాస్తవాలు
పలు అంచనాల ప్రకారం మన దేశ జిడిపిలో 25% దాకా నల్ల డబ్బు ఉంటుందని ఒక అంచనా. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దీని విలువ 30 లక్షల కోట్లకు పై చిలుకు ఉంటుంది. నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. దేశంలోని జనం కూడా అందుకు సిద్ధపడ్డారు. నోట్ల రద్దు వల్ల తమకు కలిగిన నష్టాలను, వ్యయ ప్రయాసలను పంటి బిగువున భరించారు. కోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్ వ్యవస్థకు అవతల ఉన్న మూడు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం మారుతుందని కేంద్రం అంచనా వేసింది. కానీ వాస్తవంలో జరిగింది అందుకు విరుద్ధంగా ఉంది. నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశంలో సర్క్యులేషన్ లో ఉన్న నగదులో ఏకంగా 86% అంటే 16.24 లక్షల కోట్లు 1000, 500 నోట్లే. ఇందులో వెయ్యి రూపాయల నోట్ల వాటా 38శాతం. కాగా 500 నోట్లది 47%.. ఇది మొత్తం రాత్రికి రాత్రే పనికి రాకుండా పోయింది.
99 శాతానికి తిరిగి వచ్చింది
అయితే ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చింది. ఇది రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా నల్లధనం కట్టడి కొంచమైనా నెరవేరలేదని స్పష్టమైనది. నగదు కార్యకలాపాలు తగ్గించాలనిలనే ఉద్దేశం కూడా నెరవేరలేదు. 2016 నవంబర్ నెలలో దేశ ప్రజల దగ్గర 17.7 లక్షల కోట్ల విలువైన నగదు ఉంటే.. 2022 అక్టోబర్ నాటికి ఆ మొత్తం ఏకంగా 30.88 లక్షల కోట్లకు పెరిగింది. నకిలీ నోట్ల చెలామణి కూడా తగ్గలేదని తర్వాతే కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్ల లో అత్యధికం 100 రూపాయల నోట్లో కావడం ఇందుకు కారణమని తేలింది. ఇక నోట్ల రద్దు వల్ల అటు ప్రజలకు, ఇటు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. కేవలం నగదు కార్యకలాపాల మీదే ఆధారపడి జీవించే 48 కోట్ల మందికిపైగా భారతీయులకు పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బతీసింది. దేశ జిడిపిలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్లపాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఎలా సాధ్యమవుతుంది
నోట్ల రద్దు నిర్ణయాన్ని అప్పట్లో ఆర్థికవేత్తలు కూడా ప్రశ్నించారు.” నల్లధనం లో మహా అయితే ఒక ఐదు శాతం మాత్రమే నగదు రూపంలో ఉంటుంది. మిగతాది మొత్తం భూములు, బంగారం, భవంతుల రూపంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట రద్దు వల్ల నల్లధనం మాయమైపోతుందని ఆర్బిఐ ఎలా అనుకుంది” అంటూ అప్పట్లో విస్మయం వ్యక్తం చేశారు. ఇక 2016 సెప్టెంబర్ దాకా ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన రఘురాం రాజన్ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమైన ని గత జనవరిలో తీర్పు విలువరించిన సుప్రీంకోర్టు కూడా, ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేం అంటూ వ్యాఖ్యానించింది.