‘దివీస్’పై సడెన్ గా జగన్ కు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది?

‘దివీస్’.. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ఫార్మా సంస్థ నిర్మాణాన్ని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు.దీన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు హామీ ఇచ్చారు. అదే నాడు సీఎం చంద్రబాబు మాత్రం ఈ పరిశ్రమకు అనుమతిని ఇచ్చి ప్రోత్సహించారు. వెనకేసుకొచ్చారు. అయితే ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. Also Read: వైసీపీ, బీజేపీ ‘ఫ్లెక్సీల’ వార్.. ‘విశాఖలో ఫార్మాసిటీ ఉండగా.. పచ్చని తూర్పు గోదావరిలో దివీస్ ఫార్మా కంపెనీ […]

Written By: NARESH, Updated On : December 27, 2020 4:56 pm
Follow us on

‘దివీస్’.. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ఫార్మా సంస్థ నిర్మాణాన్ని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు.దీన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు హామీ ఇచ్చారు. అదే నాడు సీఎం చంద్రబాబు మాత్రం ఈ పరిశ్రమకు అనుమతిని ఇచ్చి ప్రోత్సహించారు. వెనకేసుకొచ్చారు. అయితే ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

Also Read: వైసీపీ, బీజేపీ ‘ఫ్లెక్సీల’ వార్..

‘విశాఖలో ఫార్మాసిటీ ఉండగా.. పచ్చని తూర్పు గోదావరిలో దివీస్ ఫార్మా కంపెనీ పెట్టడం ఏంటి? అక్వాజోన్ అయిన ఈ ప్రాంతాన్ని కాలుష్య కారకంగా మారుస్తారా? ఇక్కడ మత్స్య పరిశ్రమను నాశనం చేస్తారా? ఈ పరిశ్రమతో 55 లక్షల కలుషిత నీరు సముద్రంలోకి వెళ్లి కలుస్తుంది. తద్వారా ఈ ప్రాంతం.. తుని మున్సిపాలిటీ నాశనం అవుతుందని’ ఇదే వైఎస్ జగన్ నాడు ప్రతిపక్ష నేతగా 2018 ఆగస్టు 18న పాదయాత్రలో నిప్పులు చెరిగారు. దివీస్ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి ఆ నాడు జగన్ సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి రాగానే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు.

నాడు ఈ పరిశ్రమకు అనుమతిచ్చిన చంద్రబాబు పార్టీ ఇప్పుడు  దివీస్ ను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. నాడు వ్యతిరేకించిన ఇదే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతిని ఇవ్వడం విశేషం. ఏంటి ఈ మతలబు అనేది ఆ దేవుడికి తెలియాలని స్థానికులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే స్టాండ్లు మార్చిన ఏపీలోని ప్రధాన పార్టీల తీరు చూసి ఇప్పుడు ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు రాజకీయ ఆటలో తాము బలిపశువులం అయ్యామని.. తమ జీవితాలతో ఆటాడుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

అయితే జగన్ ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే మారిపోయింది. రెండేళ్లు తిరిగే సరికి జగన్ ప్రభుత్వం దివీస్ కంపెనీని బంగాళాఖాతంలో కలుపకుండా.. తూర్పు గోదావరి జిల్లాలో అనుమతి ఇచ్చారు.

Also Read: జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్

జగన్ మారిన వైఖరితో తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్యమం మరోసారి రాజుకుంది. దివీస్ కంపెనీ చేపట్టిన నిర్మాణాలపై ఆందోళనకారులు దాడులకు దిగేదాకా వెళ్లింది. మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో ముందుకు సాగరాదని దివీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ప్రజలకు నచ్చ చెప్పాలని సూచించింది.

*దేశంలోనే పెద్ద ఫార్మా కంపెనీ దివీస్
దేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలలో దివీస్ ల్యాబోరేటరీస్ రెండో స్థానంలో ఉంది. సన్ ఫార్మా మొదటిది. అయితే మార్కెట్ విలువలో మాత్రం నంబర్ 1. విస్తరణ ప్రణాళికలో భాగంగా దివీస్ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోయూనిట్లు ఉన్నాయి. విస్తరణలో కాకినాడ సెజ్ కు సమీపంలో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2015లో చంద్రబాబు ప్రభుత్వం 530 ఎకరాల భూమిని కేటాయించింది. 2016లో తొండంగి మండలం ఒంటిమామిడిలో తన మూడో యూనిట్ ఏర్పాటును దివీస్ ప్రారంభించింది. అయితే ఈ కంపెనీ వల్ల రసాయనాలు సముద్రంలో కలిసి చేపలు, రొయ్యలు చనిపోతాయని.. పొలాలు పాడవుతాయని స్థానిక మత్య్సకారులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమం చెలరేగింది. అప్పటి విపక్ష నేత జగన్, సీపీఎం, సీపీఎలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అరెస్ట్ లు , ఆందోళనలు సాగాయి. అయితే అప్పుడు వ్యతిరేకించిన జగన్ అధికారంలోకి రాగానే అనుమతించడంపై స్థానికులు రగిలిపోతున్నారు. ఎందుకు అనుమతించారో చెప్పాలని నిలదీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పి మోసం చేస్తారా అని బాధితులు విమర్శిస్తున్నారు.

*20 రోజులుగా ఆందోళనలు, అరెస్ట్ లు
గత 20 రోజులుగా దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. డిసెంబర్ 17న పరిశ్రమ వద్ద స్తానికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ లోపలికి వెళ్లి ధ్వంసం చేశారు. వీరిపై దివీస్ ఫిర్యాదు చేయగా నిరసనకారులపై కేసులు, అరెస్ట్ లు అయ్యాయి. 36మందిని అరెస్ట్ చేసి 116మందిపై కేసులు పెట్టారు. ఇంత జరుగుతున్నా జగన్ సర్కార్ దివీస్ కంపెనీకి భారీగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరీ వంతపాడుతుండడమే ప్రజలు జీర్ణించుకోలేని విషయంగా మారింది.

అయితే దీవీస్ ఫార్మాకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్లో పలు మార్పులు చేశామని తూర్పు గోదావరి జిల్లా మంత్రి కన్నబాబు వివరణ ఇచ్చారు. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అనుమతులు ఇచ్చామన్నారు. అయితే ఇంత వ్యతిరేకత ఉన్నా.. జగన్ గతంలో వ్యతిరేకించినా మళ్లీ ఎందుకు అనుమతులను   ఇచ్చారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.

-నరేశ్

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్