Ambati Rayudu: ఏపీ పొలిటికల్ సర్కిల్లో అంబటి రాయుడు చర్చనీయాంశంగా మారారు. వైసీపీలో చేరిన వారం రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామా ప్రకటించటం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. గత కొన్ని రోజులుగా అంబటి రాయుడు చుట్టూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అది కూడా వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. దానిని తెరదించుతూ గత నెల 28న ఏపీ సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరారు. కానీ వారం రోజులు తిరగకుండానే ఆయన వైసీపీకి రాజీనామా ప్రకటించడం పెను దుమారానికి దారి తీసింది. అసలు ఏం జరిగిందన్న దానిపై రకరకాల చర్చ కొనసాగుతోంది.
అంబటి రాయుడు వైసీపీలో చేరతారని అందరికీ తెలుసు. ఆయన పార్టీలో చేరకముందే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. ఆయన వైసీపీలో చేరకముందే గుంటూరు పార్లమెంట్ స్థానంలోని అన్ని నియోజకవర్గాలను కలియతిరిగారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డారు. తరువాత విశాఖ పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా జగన్ సమక్షంలో గత నెల 28న వైసీపీలో చేరారు. గుంటూరు పార్లమెంట్ సీటుకు అంబటి రాయుడు పేరు ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరిగింది. కానీ ఇంతలో రాయుడు షాక్ ఇస్తూ వైసిపికి రాజీనామా చేశారు.
గుంటూరు పార్లమెంట్ స్థానానికి తన పేరు ఖరారు చేసి.. ఇప్పుడు మరో పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలియడమే అంబటి రాయుడు రాజీనామాకు కారణమని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు నిన్న మీడియాతో మాట్లాడారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది అంబటి రాయుడుకు నచ్చలేదని తెలుస్తోంది. పైగా రాజకీయాల్లో రోజుకో పరిణామాలతో విసిగి వేశారి పోయిన రాయుడు.. తనకు రాజకీయాలు సరిపోవని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే ఎవరితో సంప్రదించకుండా ట్విట్టర్ లో తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ చెబుతానని చెప్పిన రాయుడు.. మరి ఏం ప్రకటిస్తారో చూడాలి.