Chandrababu Vs Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు వ్యూహాల రూపొందించుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని జగన్ నమ్మకంగా చెబుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని టిడిపి, జనసేన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు తోడు.. అదనంగా కొన్ని అంశాలతో మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు పథకాలతో టిడిపి మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. త్వరలో జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. వారి అభిమానాన్ని చురగొనాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను తీసుకొచ్చింది. దీనిలో నిరుద్యోగులు, మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మేనిఫెస్టోలో స్థానం కల్పించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకి స్త్రీ నిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. దీంతో పార్టీ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 అందించేలా పథకాన్ని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద స్థానిక ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ టిక్కెట్ లేని ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
మినీ మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు రిచ్ టు పూర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ పథకంలో పేదలను సంపన్నులు చేసే విధంగా టిడిపి, జనసేన ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. వైసిపి హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు. 650 మంది నాయకులు పై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనారిటీలపై దాడులు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టిడిపి బీసీలకు రక్షణ చట్టాన్ని ప్రకటించింది. అటు రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని కూడా నిర్ణయించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 2500 రూపాయలను అందించనున్నట్లు ప్రకటించింది.
అయితే ఇప్పటికే నవరత్నాల రూపంలో అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వైసీపీ చెబుతోంది. అయితే కీలకమైన మద్య నిషేధం ఏమైనట్టు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నవరత్నాల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ అమలు చేయలేకపోయారు. సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులు హామీ ఇచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని కూడా చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఏ ఒక్కటీ చేయలేకపోయారు. పైగా ఉద్యోగులకు ఉన్న రాయితీలను సైతం నిలిపివేశారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసే సమయంలో చాలా వర్గాలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయారు. కేవలం బటన్ నొక్కడానికి పరిమితమయ్యారన్న విమర్శ ఉంది.
అటు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు జగన్ ప్రకటించిన నవరత్నాలు అంత స్పీడుగా ప్రజల్లోకి వెళ్ళలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో సైతం నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దీంతో ప్రజలకు చంద్రబాబుపై ఒక రకమైన అపనమ్మకం ఏర్పడింది. ఆ ప్రభావం మినీ మేనిఫెస్టో పై పడింది. గెలుపు కోసం ఎత్తుగడ మాత్రమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్న హామీ మాత్రం బాగుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు ఒక స్టంట్ గానే ఎక్కువమంది అభివర్ణిస్తున్నారు. పాలనాపరంగా చంద్రబాబుకు, సంక్షేమ పథకాల పరంగా జగన్ కు ప్రజలు మద్దతు తెలుపుతుండడం విశేషం.