ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అపర చాణక్యుడుగా పేరుగాంచిన బాబు రాజకీయ చతురతను ఎవరు తప్పుపట్టలేరు. ఎందుకంటే ఆయన అంచనాలు ఆ విధంగా ఉంటాయి. శకునం చె ప్పే బల్లే కుడిదిలో పడిందన్నట్లుగా ప్రస్తుతం చంద్రబాబు పలు విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో వినూత్నంగా ఆలోచించే బాబు కొద్ది రోజులుగా పట్టు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో ముందుకు రావాల్సిన బాబు పాత విషయాలనే ప్రస్తావిస్తూ మూస పద్ధతిలో అభాసుపాలవుతున్నారని తెలుస్తోంది.
కనిపించని కొత్తదనం
బాబు మాట్లాడే మాటల్లో కొత్తదనం కనిపించడం లేదు. ఫలితంగా పాత చింతకాయ పచ్చడిలా ఉందంటూ విమర్శస్తున్నారు. కాలక్షేపానికి రాజకీయాలు చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. సీఎం జగన్ ను ఇరుకున పెట్టాల్సిన బాబు సఫలం కాలేకపోతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బాబు వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో సఫలం కావడం లేదు.
దేశంలో ఎన్నో సమస్యలుండగా బాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. లోకల్ నాయకులు మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూ చులకన అవుతున్నారు. అధినేత మాట్లాడాలనుకుంటే ఎన్నో విషయాలుండగా చంద్రబాబుకు ఎందుకు తట్టడం లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తే సమాచారం దొరుకుతుంది. కానీ ఆ దిశగా ముందుకు రావడం లేదు. ఫలితంగా పసలేని విషయాలు ప్రస్తావిస్తూ దొరికి పోతున్నారు. దేశం మొత్తం మీద కరోనా రక్కసి భయపెడుతుంటే ఎందుకు దాని మీద బాబు మాట్లాడడం లేదు. ధారాళంగా మాట్లాడే బాబుకు ప్రస్తుతం ఏమైందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రెండేళ్లుగా బాబు ఏ విషయంపైనా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. జగన్ సర్కారును ఇరుకున పెట్టిన సందర్భమేదైనా ఉందంటే కనిపించడం లేదు. దీంతో జగన్ కు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆంగ్ల మాధ్యమం వద్దు, ఇసుక మాఫియాపై సత్యాగ్రహం చేశారు. కానీ ప్రస్తుతం బాబుకు సమస్యలు కనిపించడం లేదా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజావ్యతిరేకత అంశాలను ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విషయాలు ఉండాలని పలువురు భావిస్తున్నారు.