ISRO: ఆదిత్య–ఎల్1 ప్రాజెక్టులో ఎంతో కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ) పేలోడ్ తయారు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం బెంగళూరులోని ఐఐఏకు చెందిన సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ (క్రెస్ట్) క్యాంపస్‌లో ఉన్న ఎంజీకే మీనన్ ల్యాబోరేటరీలో ప్రత్యేకంగా ‘క్లాస్ 10’ క్లీన్ రూమ్‌ను రూపొందించారు. మరోవైపు అందులో ప్రవేశానికి ఎన్నో ఆంక్షలు విధించారు. ఎంతగా అంటే కనీసం.. పర్ఫ్యూమ్ వేసుకొని అందులోకి ప్రవేశించకుండా నిషేధించారు.
ఎందుకు నిషేధించారంటే..
దవాఖానల్లోని ఐసీయూలతో పోలిస్తే ఈ క్లీన్ రూమ్ లక్ష రెట్లు శుభ్రంగా ఉంటుంది. క్లీన్ రూమ్‌లో ఓ చిన్న కాలుష్య కణం ఉన్నా వీఈఎల్‌సీ తయారీ పనులు ఆగిపోయే ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు శాస్త్రవేత్తలు పడ్డ శ్రమ మొత్తం వృథా అవుతుంది. దీంతో పర్ఫ్యూమ్ వాడకాన్ని కూడా నిషేధించారు. కాగా, అందులోకి ప్రవేశించే శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకమైన సూట్లు ధరించి లోపలికి వెళ్లారు. మరోవైపు వారు అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయ్యాకే అందులోకి ప్రవేశించారు. ఫిల్టర్‌లు, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (99 శాతం గాఢత) మరియు కఠినమైన ప్రోటోకాల్‌లను ఉపయోగించారు. విదేశీ కణాల వల్ల అంతరాయాలు ఏర్పడకుండా చూసుకున్నారు.
ఆదిత్య–ఎల్1 కక్ష్య పెంపు…
ఇదిలా ఉండగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ వడివడిగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. ఆదివారం ఇస్రో చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమైంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఈ నెల 5న రెండోసారి కక్ష్యను పెంచనున్నట్లు ఇస్రో తెలిపింది. ‘ప్రస్తుతం శాటిలైట్ హెల్తీగా ఉంది. ఆదివారం చేపట్టిన కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం శాటిలైట్ 245 గీ 22,459 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతుంది. తదుపరి కక్ష్య పెంపు ప్రక్రియ సెప్టెంబర్ 5న చేపట్టనున్నారు.