Jamili Elections: జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత కమిటీ సిఫారసులను అమలు చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఆదివారం ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని నిర్ధారించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి వార్తలన్నీ మీడియా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ పదవీ కాలంలో చివరి రోజు వరకూ దేశానికి సేవ చేయాలనుకుంటున్నారని తెలిపారు. అలాగే త్వరలో కొన్ని రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి, సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించే యోచన కూడా లేదన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించి తుది నిబంధనలు ఖరారు చేసేముందు కమిటీ అన్ని పక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతుందని వివరించారు.
ప్రతిపక్షాల ఆరోపణలు తగవు
దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి కూడా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా చోటు కల్పించడం మోదీ ప్రభుత్వ విశాల హృదయానికి నిదర్శనమని అనురాగ్ చెప్పుకొచ్చారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం కావడంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సమావేశాల కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. అయితే సమావేశాల అజెండాను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ అజెండాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తగిన సమయంలో వివరిస్తారని ఠాకూర్ పేర్కొన్నారు.
‘జమిలీ’పై సన్నాహక భేటీ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థలకు జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి సిఫారసులు చేసేందుకు కేంద్రం నియమించిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయశాఖ ఉన్నతాధికారులు ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 8 మందితో కేంద్రం ఈ కమిటీని శనివారం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నితేన్ చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు మధ్యాహ్నం కోవింద్‌ను కలసి కమిటీ ఎజెండా గురించి వివరించారు. కమిటీ ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై చర్చించారు. నితేన్ చంద్ర కోవింద్ నేతృత్వంలోని కమిటీకి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే..
దేశంలో అధ్యక్ష పాలనను తెచ్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కుట్ర పన్నుతోందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. జమిలి ఎన్నికల విధాన పరిశీలనకు మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం విడ్డూరంగా వుందన్నారు. మాజీ రాష్ట్రపతులు మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయకూడదని, రాజకీయ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకూడదన్న సంప్రదాయాన్ని కూడా బేఖాతరు చేశారన్నారు. తాము చెప్పినదానికి మారుమాట్లాడకుండా తలూపుతారన్న నమ్మకంతోనే బీజేపీ ఆయన్ని ఈ కమిటీకి చైర్మన్‌గా పెట్టిందన్నారు. జమిలి ఎన్నికల ప్రత్యేక చట్టం అమలులోకి వస్తే డీఎంకే సహా ఏ పార్టీ దేశంలో మనుగడ సాగించలేదన్నారు. దేశమంతటా ‘ఒన్ మేన్ షో’గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అధ్యక్ష పాలనను నెలకొల్పి తాను దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న మోదీ ఆశల్ని నెరవేర్చేందుకే ఈ జమిలీ ఎన్నికల కుట్ర జరుగుతోందన్నారు. అడ్డదిడ్డంగా ఈ ప్రత్యేక చట్టాలు చేయడానికి బదులు ప్రధాని మోదీయే ఇకపై దేశాధ్యక్షుడని ప్రకటిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాలపై దాడి: రాహుల్ గాంధీ
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను భారతదేశంపై, దేశంలోని అన్ని రాష్ట్రాలపై దాడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ‘ఇండియా అనగా భారత్.. రాష్ట్రాల కలయిక. ఒకే దేశం-ఒకే ఎన్నిక ఈ దేశంపై, అన్ని రాష్ట్రాలపై దాడి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇండియా కూటమి ఏర్పాటైన తర్వాత కేంద్ర ప్రభుత్వం భయకంపితమైనట్లు కనిపిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరవ్ భరద్వాజ్ అన్నారు.