Why AP Needs Jagan: ” వై ఏపీ నీడ్స్ జగన్” సరికొత్తగా ఉంది కదా ఈ స్లోగన్. దీనిని తెలుగులో అక్షరాల ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అన్నదే అర్థం.అయితే ఇది అక్షరాల పార్టీ కార్యక్రమం. కానీ ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా రూపొందించారు. ఇంటింటికి వెళ్లి అధికారులను ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడికక్కడే నిలదీతలు, నిరసనలు ఎదురుకావడంతో పార్టీ నేతలు జనంలోకి వెళ్ళలేక ముఖం చాటేశారు. దీంతో దానికి కాస్త చేర్పులు మార్పులు చేసి ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం.. తొలుత వైసిపి రాజకీయ నినాదం. ఇప్పుడు దానిని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు.
ఏపీలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాల్లో.. 1.40 కోట్ల కుటుంబాలు ప్రభుత్వ పథకాలు అందుకున్నట్లు గుర్తించి.. వారందరికీ బ్రోచర్లు అందించాలని.. ప్రతి కుటుంబానికి అందే లబ్ది నగదు రూపంలో చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం ఏకంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో 24 పేజీల బ్రోచర్లను ముద్రించారు. తనది విప్లవాత్మకమైన పాలన అంటూ జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇందులో గాంధీ, అంబేద్కర్, కలాం కొటేషన్లను వాడుకున్నారు. గ్రామ స్వరాజ్యం, సామాజిక స్వేచ్ఛ, మహిళా వికాసం గురించి ఆ మహనీయులు చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
డిసెంబర్ 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. వైసిపి ప్రభుత్వం లో జరిగిన మేలు పై ప్రజా తీర్పు సర్వే తో కార్యక్రమాలు చేపట్టనున్నారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మేనిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5% పూర్తి చేసిన సీఎం జగన్అంటూ ప్రకటనలు పొందుపరచనున్నారు.
ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించామనే విషయాన్ని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తమ కుటుంబాలకు మంచి జరిగిందని నమ్మితేనే తనకు మద్దతు నిలవాలని పదేపదే జగన్ సూచిస్తూ వస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు న్యాయం చేశానని… వారంతా జగన్ రావాలని కోరుకుంటున్నారని నమ్మకం కలిగేలా చూడాలన్నది వైసీపీ సర్కార్ ప్రయత్నం. అయితే దీనిని ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో సహకారం చేయించుకోవాలన్న ప్రయత్నం మాత్రం విమర్శలకు తావిస్తోంది.