Munugode By Election 2022: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి మంగళవారం సాయంత్రతో తెరపడనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నాడి అర్థం కాక అంతర్మధనంలో పడ్డాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నింటికీ జైకొట్టిన ఓటర్లు అన్ని పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు ఇలా ప్రతీదానిలోనూ పాలుపంచుకున్నారు. మునుగోడు ఓటర్లు తమ వద్దకు ఓటు కోసం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర తమతమ ప్రాంతాలకు ఏంకావాలో చెప్పి వాటికి సంబంధించిన హామీలు తీసుకున్నారు. కానీ, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు మునుగోడు ఓటర్ నాడి కనిపించలేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఓటర్లు ఏ పార్టీ కొంప ముంచుతారో అర్థం కావడం లేదు.

టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తారా?
మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే, కేసీఆర్ జాతీయ పార్టీకి దేశంలో పరువు ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్తులో జరిగే ఎన్నికలపై టీఆర్‌ఎస్‌కు పట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను గులాబీ నేతలు సీరియస్‌గా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఊరికి ఒక ఎమ్మెల్యేని రంగంలోకిదించి ఎన్నికల ప్రచారం చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలోని మంత్రులందరూ మునుగోడులో మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సైతం నోటిఫికేషన్‌కు ముందు ఒక బహిరంగ సభ, మూడు రోజుల క్రితం చండూరులో మరో సభ నిర్వహించి మునుగోడు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీకి పట్టం కడతారా?
ఇక మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పార్టీ బీజేపీ. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్తు ఎన్నికల్లో పట్టు ఉంటుందని భావించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి గెలిచేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. బీజేపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ గుర్తు కమలం ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, గుర్తుని ఎక్కువగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనేకచోట్ల రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యాయి. తన రాజీనామాతోనే వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని, అందుకే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. అయితే మునుగోడు ఓటర్లు రాజగోపాల్‌రెడ్డిని మళ్లీ ఆదరిస్తారా లేదా అన్నది మాత్రం కాషాయ నేతలను టెన్షన్ పెడుతోంది.

కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు..
మునుగోడు ఎమ్మెల్యే సీటు తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్న మరొక పార్టీ కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది. పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు మునుగోడు ఉప ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపించాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన మాట్లాడిన ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునుగోడులో సమన్వయంతో పని చేయకపోవడంతో పార్టీ ఎన్నికల ప్రచారంలో వెనకబడింది.
హస్తానికి ఓటేస్తారా?
మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినప్పటికీ మునుగోడు ఓటర్లు ఆదరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. మునుగోడులో గెలిస్తే భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు దొరుకుతుందని భావిస్తున్నా టీపీసీసీ ప్రచారంలో మాత్రం టీఆర్‌ఎస్ , బీజేపీకి పోటీగా దూసుకు పోలేకపోయింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నాడి అర్థం కాక టెన్షన్ పడుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆందోళకు గురిచేస్తోంది.