Munugode By Poll: తెలంగాణలో అత్యంత ప్రష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాం మంగళవారం సాయంత్ర 6 గంటలతో ముగియనుంది. నవంబర్ 3న ఉపఎన్నిక జరుగనుంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు మాత్రమే కాక, రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మునుగోడులో గెలిచేదెవరు? మునుగోడులో పట్టు సాధించేది ఎవరు? మునుగోడుపై జెండా ఎగురవేసేది ఎవరు అన్నది? అందరిలోనూ జరుగుతున్న ప్రధానమైన చర్చ. మరోవైపు ఓటర్లు మాత్రం ఎవరిపైపు ఉన్నారనేది అంతుచిక్కడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

పీక్స్‌కు చేరిన ప్రచారం..
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రధాన పార్టీలు ప్రచారం షురూ చేశాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి∙మునుగోడు ఉప ఎన్నికల పోరు పీక్స్‌కు చేరుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నానారకాలుగా ప్రయత్నించారు. దసరా దీపావళి పండుగలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రతీ పండుగకు మునుగోడు ఓటర్లకు తోఫా ఇచ్చి వారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విందులు, వినోదాలు, మందు పార్టీలతో హోరెత్తించారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
అన్ని రకాల ప్రచారం బంద్..
ఇక మునుగోడులో ఏ పార్టీకి ఆ పార్టీ తమ జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయి అనేది ఐదు రోజుల్లో తేలనుంది. నవంబర్ 3 పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడుతుందని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని ఆపివేయాలని, సోషల్ మీడియాలో కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచారం చెయ్యొద్దని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపించ్దొని అధికారులు సూచిస్తున్నారు.
నాన్ లోకల్స్ వెళ్లిపోవాల్సిందే..
ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులెవరూ మునుగోడులో ఉండొద్దని ఆదేశించారు. 6 గంటల తర్వాత నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తామని తెలిపారు. మునుగోడు పోలింగ్ సంబంధించి మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం ఉండగా అదనంగా మూడు వందల మందిని నియమించినట్టు తెలిపారు .

చివరి రోజు హోరెత్తుతున్న ప్రచారం..
ఇక చివరి రోజైన మంగళవారం ప్రధాన పార్టీల ప్రచారంతో మునుగోడు హోరెత్తనుంది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గంలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ తరపున రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా గర్జన సభ ఏర్పాటు చేసింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
జోరందుకోనున్న ప్రలోభాలు..
ప్రచారానికి తెరపడనుండడంతో ఇక అందరి దృష్టి పోలింగ్‌పై ఉండనుంది. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జోరందుకోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచే ప్రలోభాలకు తెరలేపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరక ఇప్పటికే కీలక నేతల ఇళ్లకు డబ్బులు చేరినట్లు తెలుస్తోంది. ఈసారి ఓటుకు టీఆర్‌ఎస్ రూ.40 వేలు ఇస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ కూడా డబ్బులతో గెలవాలని చూస్తోంది టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 10 ఓట్లు ఉన్న ఇంటికి తులం బంగారం ఇవ్వాలని చూస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం నిఘా మరింత పెంచింది. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన భారీగా నగదు పట్టుబడింది. మంగళ, బుధ, గురువారాల్లో ప్రలోభాలతో మరింత డబ్బు, కానుకలు పట్టుపడే అవకాశం ఉంది.