తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీరామారావు మనమధ్య లేనప్పటికీ ఆయనను ప్రతీ తెలుగు వ్యక్తి గుర్తు చేసుకుంటారు. ఆయన పార్టీ పెట్టిన కొద్దిరోజుల్లేనే ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టి రికార్డు సృష్టించాడు. దీంతో ఆయనకు ఎనలేని వీరాభిమానులు తయారయ్యారు. అయితే ఎన్టీఆర్ ఆశయాలను ఆయన వారసులు సాధించడానికి కృషి చేస్తున్నారా..? తెలుగువారందరూ కలిసుండాలని ఆయన స్థాపించిన పార్టీని బతికిస్తున్నారా..? అంటే పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన టీడీపి ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తరువాత అంతటి మహోన్నత వ్యక్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుంటారు. ఈయన కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన సిద్ధాంతాలు, ఆశయాలను ఆయన వారసుడైన జగన్ కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు. వైఎస్ ఉన్న పార్టీలో లేకుండా సొంతంగా ఆయన పేరు మీద పార్టీ పెట్టి రాజన్న అభిమానుల కోరిక తీరుస్తున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ అభిమానులున్నారు. కానీ వైసీపీ మాత్రం ఏపీకే పరిమితమైంది.
ఇది గ్రహించిన ఆయన కుమార్తె షర్మిల ఇటీవల రాజన్న అభిమానులతోసమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. త్వరలోనే పార్టీ పెట్టే క్రమంలో కరోనా అడ్డంపడింది. ఏదీ ఏమైనా వైఎస్ ఆశయాలను మాత్రం ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎన్టీఆర్ కుమారులు గానీ, ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు గానీ.. టీడీపీని బలోపేతం చేయడానికి ఏమాత్రం కృషి చేయడం లేదనే చెప్పాలి.
అధికారంలో ఉన్నంత సేపు టీడీపీతో ఉండి.. ఎన్టీఆర్ పేరుచెప్పుకొని పదవులు అనుభవించిన వారు ఇప్పుడు అధికారం కోసం ఇతర పార్టీలకు వెళ్లారు.. రాజకీయాల్లో ఇది కామన్. అయితే ఎన్టీఆర్ వారసులు సైతం టీడీపీని ఈ స్థితిలో చూసి కూడా కనీసం పార్టీని బతికించుకుందామన్న ధ్యాస లేదని సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న టీడీపీ కూడా ఏపీకే పరిమితం అయింది. అయితే తెలంగాణలో అప్పుడప్పుడు పోటీ చేస్తున్నా కనీస ఓట్లుు కూడా పడడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏ ఒక్కరూ కృషి చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.