
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ వేడి చల్లారకముందే మరో ఎన్నికల వేడి స్ట్రాట్ కానుంది. అదే ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో జరిగే అవకాశముంది. ఈ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ రావడంతో ఇక్కడ పార్టీల మధ్య అప్పుడే పోటా పోటీ నెలకొంది. ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పదవీకాలం వచ్చే నెలాఖరులో పూర్తి కానుంది. ఆ తరువాత ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు ఇక్కడ తమ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు పన్నుతున్నారు.
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో టీడీపీ దక్కించుకుంది. ఆ సమయంలో అధికారంలో ఉన్న సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏఎస్ రామకృష్ణ తన పదవీ కాలం పూర్తి చేసుకున్న తరువాత టీడీపీ వీడారు. ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలు పెట్టారు. ఉపాధ్యాయులకు తాను ఎంతో మేలు చేశానని మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. మరి టీడీపీ నుంచి ఎవరోనన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది.
అధికార వైసీపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ కల్పలతకు ఫ్యాన్ పార్టీ మద్దతు ఇస్తుందని చర్చించుకుంటున్నారు. ఆమెకు అనుబంధంగా వైసీపికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఆమె భర్త విద్యాశాఖలో పనిచేస్తున్నందున తాను విజయం సాధిస్తానని నమ్ముతోంది. అయితే అధికార ప్రకటన వచ్చే వరకు మాత్రం వేచి చూడాల్సిందేనని అంటున్నారు కొందరు.
ఇక మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర్ రావు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఆయన వామపక్షాల మద్దతు తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఎస్టీఎఫ్, యూటీఎఫ్ సంఘాల మద్దతుతో రంగంలోకి దిగనున్నారు. అయితే ఇతరులు ఓటు బ్యాంకును నాగేశ్వర్ రావు ఎలా సంపాదించుకుంటాడోనన్న చర్చ సాగుతోంది. మొత్తంగా గుంటూరు-కృష్ణా స్థానానికి పోటీ పెరిగింది. ఫైనల్ గా ఎవరు ఇక్కడ పాగా వేస్తారో చూడాలి..