BJP- Jagan vs Pawan Kalyan: ఓవైపు బలంగా జగన్.. మరోవైపు పోరాటలతో పవన్ కళ్యాణ్.. మధ్యలో ‘లాస్ట్ ఛాన్స్’ చంద్రబాబు.. ఈ ముగ్గురూ అధికారం కోసం ఆడుతున్న ఆటలో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు? ఎవరిని గద్దెనెక్కిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ మొత్తం పోరులో తెరవెనుక కీలక శక్తిగా బీజేపీ ఉంది. దాని మద్దతు ఎవరికి ఉంటే వారికే బోలెడంత పవర్ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ క్షణంలోనైనా రాష్ట్ర రాజకీయాలు మార్చేంత శక్తి కలదు. హంగ్ వస్తే బీజేపీ+జనసేన కింగ్ మేకర్ గా అవతరిస్తుంది. జగన్,చంద్రబాబులను ఆడించి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అయితే ప్రస్తుతానికి కేంద్రంలోని బీజేపీ అటు జగన్ కు.. ఇటు పవన్ కళ్యాణ్ కు సమదూరంతో వ్యవహరిస్తోంది. జగన్ కోరికలు తీరుస్తూ పవన్ కళ్యాణ్ తో పొత్తులో సాగుతోంది. మరి నిజంగా బీజేపీ మద్దతు ఎవరికుందన్న దానిపై స్పెషల్ స్టోరీ

–బీజేపీ స్టాండ్ ఏంటి?
ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంత గందరగోళంగా ఉన్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరికి శత్రువులో అర్ధం కాని రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార పక్షంగా వైసీపీ.. ప్రధాన విపక్షంగా టీడీపీ ఉన్నా.. ఇప్పుడు అందరి ఫోకస్ జనసేన వైపే ఉంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్ట్రాటజీ ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. గ్రామస్థాయిలో రచ్చబండల నుంచి టీవీల్లో చర్చా వేదికల వరకూ ఇదే హాట్ టాపిక్. కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి వెళతారు అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అటు పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ మాత్రం మాది స్పష్టమైన స్టాండ్ అని.. వచ్చే ఎన్నికల్లో పవన్ తో వెళతామని మాత్రమే చెబుతోంది. ఎట్టి పరిస్థితులతో టీడీపీతో వెళ్లేది లేదని బీజేపీ తేల్చిచెబుతోంది. అయితే అది అధికార వైసీపీకి లాభం చేకూర్చడమేనన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో జగన్ సర్కారుకు బీజేపీ పెద్దలు అన్నివిధాలా సహకరిస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో బీజేపీ స్టాండ్ పై విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బీజేపీ పవన్ కు మద్దతు తెలుపుతుందా? లేక జగన్ కు లాభం చేకూర్చుతుందా? అన్న టాక్ అయితే ప్రారంభమైంది.
-చంద్రబాబు పని అయిపోయింది..
2014 ఎన్నికలకు ముందు జనసేన ఆవిర్భవించింది. పవన్ నేతృత్వంలో పురుడుబోసుకుంది. కానీ పవన్ చాలా దూరదృష్టితో ఆలోచించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని భావించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని కూడా అంచనా వేశారు. ఏపీకి ఇతోధికంగా సాయం చేస్తారని కూడా భావించారు. అలాగే విభజిత ఏపీని గాడిలో పెట్టి దేశపటంలో ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే చంద్రబాబు వంటి అనుభవశాలి అవసరమని కూడా భావించారు. అందుకే కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు తెలిపారు. టోటల్ గా ఎన్టీఏ కూటమికి సపోర్టు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి తన వంతుగా కృషిచేశారు. కానీ చంద్రబాబు తన పాత వాసనల రాజకీయం విడిచిపెట్టడలేదు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే ప్రధాని మోదీతో కయ్యం పెట్టుకున్నారు. రాజకీయ అభద్రతా భావానికి గురై ఎన్డీఏకు తనంతట తాను దూరమయ్యారు. రాజకీయ వైరంతో తాను నష్టపోయారు. రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. పవన్ ఏ అనుభవాన్ని ఆశించి చంద్రబాబుకు మద్దతు తెలిపారో అది ఫలించకుండాపోయింది. వైసీపీకి అధికారాన్ని అప్పగించిన చంద్రబాబు అచేతనంగా ఉండిపోయారు. ప్రస్తుతానికి వైసీపీకి బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తోందని ఎక్కువగా వాదిస్తున్నది తెలుగుదేశం పార్టీయే. పవన్ కు కాదని జగన్ కు ప్రాధాన్యిమిస్తున్నారని చెప్పడం ద్వారా పవన్ ను కట్టడి చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అప్పుడే పవన్ తమతో కలుస్తారని భావిస్తున్న వారు ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. వాస్తవానికి 2019ఎన్నికల ముందు వరకూ బీజేపీకి జాతీయ స్థాయిలో అప్తమిత్రుడిగా చంద్రబాబు కొనసాగారు. మహారాష్ట్రలోని శివసేన తరువాత టీడీపీదే బీజేపీ మిత్రపక్ష స్థానం. కానీ దానిని చేజేతులా పాడుచేసుకున్నది కూడా చంద్రబాబే. నాడు వైసీపీ ట్రాప్ లో పడి చిరకాల మిత్రుడ్ని వదులుకోవడమే కాకుండా..బీజేపీపైనే విష ప్రచారం మొదలు పెట్టారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ పక్కన చేరారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు జగన్ కు అది కలిసి వచ్చింది. చంద్రబాబుకు మూల్యం తప్పలేదు. ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పలేదు. అంతమాత్రాన నేరుగా బీజేపీ సాయంతోనే జగన్ అధికారంలోకి వచ్చారన్నది భ్రమే. అలాగని ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలు జగన్ కు రాజకీయంగా సాయం చేస్తున్నారన్నది ఊహాగానమే.
-జనసేనతోనే బీజేపీ.. కానీ..
ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల తరువాత ఏపీలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పవన్ సిద్ధమయ్యారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మిత్రుడిగా కొనసాగేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మిత్రుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో అనేక రకాల వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలు వైసీపీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న టాక్ నడుస్తూ వస్తోంది. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రధాని మోదీ ఈ దేశానికి పాలకుడు. దేశాన్ని పాలిస్తోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి. దేశంలో ఏపీ ఒక అంతర్భాగం. అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీని పరిగణిస్తున్నారే తప్ప.. వైసీపీకి ప్రత్యేక ప్రోత్సాహమంటూ ఏదీ లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వేలుపెట్టడం లేదు. అయితే దీనిని ప్రత్యర్థులు వేర్వేరుగా విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పటికీ రాజకీయంగా తమ స్టాండ్ ఒక్కటేనని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే నడుస్తామని గంటాపధంగా చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఇప్పడు దేశంలో అజేయమైన శక్తిగా ఉంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించే పనిలో పడింది. అన్ని రాష్ట్రాల్లో సొంతంగా నిలబడాలన్న ప్రయత్నంలో ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట తమ బలం పెంచుకునే పనిలో పడింది. ఏపీ విషయానికి వచ్చేసరికి అటు వైసీపీ, ఇటు టీడీపీలు కూడా బలంగా ఉన్నాయి. వాటికి సమానంగా జనసేన ఎదుగుతోంది. పైగా జగన్, చంద్రబాబులతో పోల్చుకుంటే పవన్ నమ్మదగిన మిత్రుడు. పైగా తాను ఎదగడంతో పాటు బీజేపీ ఎదిగేందుకు ఆయన దోహదపడతారని కేంద్ర పెద్దలు నమ్మకంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ ను ముందుపెట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ బంతి పవన్ కోర్టులో ఉందని కూడా చెబుతున్నారు. ఓవరాల్ గా ఈ పొలిటికల్ గేమ్ లో జనసేనతో బీజేపీ వెళ్లనుంది. కేవలం ఇప్పుడు బలాన్ని చూసే వైసీపీకి సానుకూలంగా ఉంది. రేపు ఫలితాలు మారితే పవన్ ను ముందు పెట్టి రాజకీయాన్ని నడిపించాలని బీజేపీ భావిస్తోంది