Minister Mallareddy Educational Institutions: “బర్లు కొన్న. పాలమ్మిన. పూలు అమ్మిన. బోర్లు వేసిన. చిట్ ఫండ్ లు నడిపిన” మీకు ఇన్ని ఆస్తులు ఎలా సమకూరాయి అని విలేకరులు అడిగితే మంత్రి మల్లారెడ్డి చెప్పిన సమాధానం అదీ. అన్నట్టుగానే మంత్రి మల్లారెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆయనకు భారీగా భూములు ఉన్నాయి. దీనికి తోడు లెక్కకు మిక్కిలి కాలేజీలు ఉన్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుందని సమాచారం. ఐటి దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి సిబ్బందికి కోట్ల జీతాలు ఇస్తున్నట్టు ఒప్పుకున్నారు. తాను కష్టపడి పైకి వచ్చానని, హై థింకింగ్, లో ప్రొఫైల్ లో జీవిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు. అయితే మల్లారెడ్డి సంస్థలపై భారీగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వాటిని ఖండించకపోవడం గమనార్హం. సొంత పార్టీలో కొంతమంది నేతలే మల్లారెడ్డి కి తగిన శాస్తి జరిగిందని అంతర్గతంగా చర్చించుకోవడం విశేషం.

దాదాపు 31 విద్యాసంస్థలు
ఐటీ శాఖ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలపై తీవ్ర చర్చ జరుగుతున్నది. మల్లారెడ్డికి ఎన్ని విద్యాసంస్థలు ఉన్నాయి? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎవరి పేరు మీద ఉన్నాయి? వీటిపైనే హాట్ హాట్ చర్చ సాగుతోంది. షాపూర్ నగర్ లో సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ఒక అంతర్జాతీయ పాఠశాల నిర్వహిస్తున్నారు. సూరారం ప్రాంతంలో ఎంబీ గ్రామర్ స్కూల్ పేరిట పదో తరగతి వరకు పాఠశాల నిర్వహిస్తున్నారు. దూలపల్లి లో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట ఒక కళాశాల నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పేరిట మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో అటానమస్ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇదే మైసమ్మగూడలో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ పేరిట ఒక కళాశాల ఉంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ పేరిట మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ లో ఒక కాలేజీ ఉంది.. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పేరిట మైసమ్మగూడలో, దూలపల్లి లో కళాశాలలు నిర్వహిస్తున్నారు. కేవలం ఇంజనీరింగ్, పాఠశాల విద్య కాకుండా బీఈడీ కళాశాలలు కూడా నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ పేరిట మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో ఫార్మా కాలేజీ నిర్వహిస్తున్నారు.. ఇక మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో మల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ ఫర్ విమెన్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కో ఎడ్యుకేషన్, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ ఎడ్యుకేషన్, మల్లారెడ్డి బీఈడీ కాలేజీ పేరిట కొంపల్లి ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నాయి.
అల్లుడు పేరిట
మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ పేరిట దుండిగల్ లో ఒక కాలేజి నిర్వహిస్తున్నారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరిట గండి మైసమ్మ, దుండిగల్ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నాయి. ఎమ్ఎల్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట కుత్బుల్లాపూర్ లో ఒక కాలేజీ ఉంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట కాచారం ప్రాంతంలో ఒక కళాశాల ఉంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పేరిట గండి మైసమ్మ ప్రాంతంలో ఒక కళాశాల ఉంది. దుండిగల్ ప్రాంతంలో అరుంధతి పేరిట ఒక వైద్య కళాశాల ఉంది..
మల్లారెడ్డి తమ్ముడి పేరిట
మల్లారెడ్డి పేరు మీదే కాకుండా ఆయన తమ్ముడి పేరు మీద కూడా కళాశాలలు ఉన్నాయి. బోయిన్ పల్లి లో సీఎంఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇదే బోయిన్ పల్లిలో సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. గాజులరామారంలో సీఎంఆర్ హైస్కూల్ ఉంది. కండ్ల కోయలో సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పేరిట కళాశాల ఉంది. కండ్లకోయలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇదే కండ్లకోయలో సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట ఒక కాలేజ్ ఉంది. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పేరిట కండ్లకు మరో కాలేజీ ఉంది. బాలనగర్ లో సెయింట్ మార్టిన్ పేరిట ఒక స్కూల్ ఉంది. మల్కాజిగిరిలో సెయింట్ మార్టిన్ పేరిట మరో స్కూల్ ఉంది. నాచారంలో సెయింట్ మార్టిన్ పేరిట ఇంకొక స్కూల్ నడుస్తోంది. చింతల్ ప్రాంతంలో సెయింట్ మార్టిన్ స్కూల్ మరో శాఖ ప్రారంభించారు.

విలువ వందల కోట్ల పై మాట
మల్లారెడ్డి చెబుతున్నట్టు ఆయన స్థాపించిన విద్యాలయాల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్ల దాకా ఉంటాయి. పైగా మల్లారెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవారు కావడంతో అప్పట్లో తక్కువ ధరకు స్థలాలు కొన్నారు. రియంబర్స్మెంట్ పథకాన్ని వినియోగించుకొని కళాశాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం కళాశాల మూతపడుతుంటే ఒక మల్లారెడ్డి మాత్రం కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు.. పెద్ద పెద్ద వారికి కూడా మల్లా రెడ్డి విజయ రహస్యం అంతుపట్టడం లేదు..