Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? చేస్తే ఎన్ని నియోజకవర్గాల్లో? పోటీ చేయని మిగతా చోట్ల పరిస్థితి ఏమిటి? లేకుంటే ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకుంటుందా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అందరి చూపు తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. అధినేత చంద్రబాబు కేసుల్లో చిక్కుకొని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన బయటకు వస్తే కానీ.. దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. కానీ ఇంతలో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల ప్రకటనలు చేసి టిడిపి క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు అధికార బీఆర్ఎస్, బిజెపి ఎవరికివారుగా ప్రయత్నాలు ప్రారంభించాయి.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉంది.నాయకులు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ.. ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. క్యాడర్ మాత్రం కొనసాగుతూ వచ్చింది. 2014లో 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2018లో మాత్రం రెండు స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. అయినా సరే ఓటింగ్ పరంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆ పార్టీ ఎవరితో జట్టు కట్టలేదు. ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
ఇప్పటికే తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొంది. ఒకవైపు అధికార బిఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బిజెపి గట్టిగానే పోరాడుతున్నాయి. కాంగ్రెస్లో విలీన అంశం కొలిక్కి రాకపోవడంతో షర్మిల వైయస్సార్ టిపి సైతం బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జనసేన సైతం 33 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను ప్రకటించింది. ఈ తరుణంలో సెటిలర్స్ తోపాటు రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉంది. హైదరాబాద్ నగరం తో పాటు ఖమ్మం జిల్లాలో సైతం తెలుగుదేశం పార్టీ ఓట్లు గణనీయంగా ఉండడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు అటు బి ఆర్ ఎస్, ఇటు బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై తప్పక చూపుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యం కచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత హైదరాబాదులో ఆందోళనలకు కెసిఆర్ ప్రభుత్వం అడ్డు చెప్పింది. అటు మంత్రి కేటీఆర్ ట్విట్లు సైతం ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్నచోట దెబ్బ తప్పదని భావించిన కేటీఆర్ జరిగిన డ్యామేజ్ ను అధిగమించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టు తరువాత లోకేష్ బా ధతో వ్యక్తం చేసిన ట్వీట్ పై స్పందించారు. తన సానుభూతిని తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు పాపం వెనుక బిజెపి ఉందని కామెంట్స్ చేశారు.అటు బిజెపి సైతం టిడిపి క్యాడర్ను ఆకట్టుకునేందుకు లోకేష్ ను పిలిచి మరి చంద్రబాబు అరెస్టుపై వివరాలు తెలుసుకుంది. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ వెనుక బిజెపి పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అటు ఢిల్లీలో నెలరోజుల పాటు పడి కాపులు కాసిన లోకేష్ ను కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణం అన్న కామెంట్స్ వినిపించాయి. ఇది తెలంగాణలో సెటిలర్స్ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో బిజెపి అగ్రనేత అమిత్ షా.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా లోకేష్ ను పిలిపించుకొని మాట్లాడడం విధితమే. ఇలా టిడిపి ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుంటూ బిఆర్ఎస్, బిజెపిలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూస్తుండడం విశేషం.