Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠ వీడింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టింది. 200 పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. కూటమిలోని బీజేపీ 130పైగా సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన(ఏక్‌నాథ్‌షిండే) 53, ఎన్‌సీపీ(అజిత్ పవార్) 40 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా మహాయుతి 200కుపైగా సీట్లతో అధికారం చేపట్టబోతోంది. కొత్త ముఖ్యమంత్రి నవంబర్ 26న ప్రమాణం చేస్తారని ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌షిండే ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. నవంబర్ 25న లెజిస్లేటివ్ పార్టీ సమావేశమై సీఎంను ఎన్నుకుంటుందని ప్రకటించారు. ఇక మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ దేరేకర్ తెలిపారు. మరోవైపు సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర దించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. ముంబైకి పార్టీ పరిశీలకులను పంపించింది. కూటమిలోని పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఫడ్నవీస్ తెలిపారు. వివాదం ఏమీ లేదని స్పష్టం చేశారు.
రేసులో ముందున్న ఫడ్నవీస్..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఉన్నారు. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌షిండే, బీజేపీ నేత దేవేంద్రఫడ్నవీస్‌తోపాటు, ఎన్‌సీపీ(అజిత్‌పవార్)పార్టీ చీఫ్ అజిత్ పవార్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు. అయితే ఈ రేసులో ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన మూడోసారి పదవి దక్కించుకోన్నుట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సీఎం మాత్రం అధిక సీట్లు గెలిచిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాలన్న నియమం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కాదని మోహన్‌యాదవ్‌కు బీజేపీ సీఎంగా ఎంపిక చేసింది. అటువంటి ప్రయోగం మహారాష్ట్రలోనూ చేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
2019లోనూ ఇదే ఉత్కంఠ..
2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 103 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ఒక్కటిగానే ఉండేది. పదవీ కాంక్షతో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు ధర్మాన్ని విస్మరించారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక ఈసారి బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోంది. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో సీఎం రేసులో ముగ్గురూ ఉన్న విషయం స్పష్టమవుతోంది.
72 గంటల్లో కొత్త ప్రభుత్వం!
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న ముగుస్తుంది. దీంతో గెలిచిన కూటమి 72 గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుతోపాటు, సీఎం ఎంపికపైనా కూటమి నేతలు నిమగ్నమయ్యారు.