ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో కొత్త పల్లవి అందుకున్నారు. కడప జిల్లా అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. అత్యుత్తమ నగరాల్లో కడపను చేర్చుతామని పేర్కొన్నారు. దీంతో కడపవాసులు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎక్కడ నుంచి అవుతుందని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్ కనుసనన్నల్లోనే జరిగేది. ఇప్పుడు అభివృద్ధి పాట అందుకోవడం గమనార్హం.
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లు ఉన్నారు. సీఎం జగన్ మరో రెండేళ్లు అధికారంలో ఉన్నారు. కానీ కడప అభివృద్ధి గడప దాటలేదని తెలుస్తోంది. ఈ రెండేళ్లలో వందల జీవోలు జారీ చేసినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పులివెందులలో అభివృద్ధి పనులు చేసి మెప్పు పొందాలని భావించినా ఆచరణలో కనిపించడం లేదు. అయినా కడప పరిస్థితి మారడం లేదు. దీంతో ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోతోంది.
కడప జిల్లాలో వైఎస్ కుటుంబానిదే దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగుతున్నా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రజలు వెనుకబడిపోయారు. శాంతిభద్రతలు కూడా అంతంత మాత్రమే. అభివృద్ధి పనులు జరగకపోయినా అధికారం మాత్రం వారిదే. సీఎం హోదాలో ఉండి కూడా పనులు చేపట్టడంలో ముందుకు రాకపోవడం దారుణమే. కడపలో ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే అభివృద్ధి చెందే విధంగా పనులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత. సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి కనిపించకపోవడంపై ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. పులివెందులలో కనీసం బస్టాండ్ కూడా లేకపోవడం విడ్డూరమే. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని నాయకులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని మాటలు చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఇప్పటికైనా నేతల్లో మార్పు వచ్చి నియోజకవర్గం ఎదిగేందుకు పాటుపడాలని సూచిస్తున్నారు.